మానవత్వం చూపడమే నేరమా!?
ప్రాణాంతక కేన్సర్‌తో మోదీ భార్య బాధపడ్తోంది
* అందుకే మానవతా దృక్పథంతో స్పందించా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రతిష్టంభనకు, తనపై విపక్షాల ఆరోపణలకు కారణమైన ‘లలిత్‌గేట్’పై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను సాయం చేసింది లలిత్ మోదీకి కాదని, కేన్సర్‌తో బాధపడుతూ చావుబతుకుల్లో ఉన్న ఆయన భార్యకని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితే ఎదురైతే ప్రతిపక్ష నేత సోనియాగాంధీ ఎలా స్పందించేవారంటూ ప్రశ్నించారు. ‘నీ చావు నువ్వు చావంటూ ఆ కేన్సర్ రోగిని వదిలేసేవారా?’ అంటూ గురువారం లోక్‌సభలో భావోద్వేగపూరిత ప్రకటన చేశారు.
లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు అందించాలంటూ తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని, ఆ నిర్ణయాన్ని బ్రిటన్‌కే వదిలానని స్పష్టం చేశారు. ‘లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలనుకుంటే.. ఆ నిర్ణయం భారత్‌తో బ్రిటన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదు’ అని మాత్రమే బ్రిటన్ ప్రభుత్వానికి చెప్పానని వివరణ ఇచ్చారు. అదికూడా కేవలం మానవతా దృక్పథంతో చేశానని వివరించారు.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్న సుష్మ.. ప్రతిపక్షంలోని మిత్రులు తనకా అవకాశం ఇవ్వడం లేదని, తన వాదన వినేందుకు వారు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. మీడియాలోనూ ఈ విషయంలో వరుసగా తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వారికి సవాలు చేస్తున్నా. మీ ఆరోపణలను రుజువు చేసే ఒక్క కాగితం ముక్క, ఒక్క ఈమెయిల్ కాపీ, ఒక్క డాక్యుమెంట్ ను చూపండి’ అన్నారు.
‘అంతా ఇదెలా చేశావని అడుగుతున్నారు. నేనేం చేశాను? మోదీకేమైనా ఆర్థిక సాయం చేశానా? భారత్ నుంచి తప్పించుకునేందుకు సాయపడ్డానా?’అని ఆగ్రహంగా ప్రశ్నిం చారు. ‘లలిత్ మోదీ భార్య గత 17 ఏళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. దాదాపు 10 సార్లు ఈ ప్రాణాంతక వ్యాధి ఆమెకు తిరగబెట్టింది. ఆమెకు పోర్చుగల్‌లో తక్షణమే చికిత్స చేయడం అత్యవస రం. అలాంటి మహిళకు సాయంచేయడం నేరమా? ఒకవేళ అది నేరమే అయితే, నేను నేరం చేశానని ఈ సభలో ఒప్పుకుంటున్నా.
దీనికి ఏ శిక్షకైనా నేను సిద్ధమే’ అని ఉద్వేగపూరితంగా అన్నారు. ‘నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారు? తన చావు తాను చావమని ఆ కేన్సర్ పేషెంట్‌ను వదిలేసేవారా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోర్చుగీస్ డాక్టర్ల నివేదికను ఆమె చదివి వినిపించారు. లలిత్‌కి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇస్తూ.. నిబంధనల ప్రకారమే వాటిని జారీ చేస్తున్నామని బ్రిటన్ హోంశాఖ ప్రకటించింది కానీ, భారత విదేశాంగ మంత్రి సిఫారసుల ఆధారంగా వాటిని జారీ చేస్తున్నట్లుగా ప్రకటించలేదని సుష్మాఅన్నారు. సుష్మ ప్రకటన చేస్తున్న సమయంలో ప్రతిపక్ష స్థానాలు దాదాపు ఖాళీగా ఉన్నాయి.
అధికార పక్ష సభ్యులు మాత్రం బల్లలు చరుస్తూ సుష్మ ప్రకటనపై తమ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకపోవడాన్ని సావకాశంగా తీసుకుని తానీ ప్రకటన చేయడం లేదని, ఈ అంశంపై చర్చ కోసం ఎదురు చూస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘జననం, మరణం.. గౌరవం, అప్రతిష్ట.. ఇవన్నీ దైవ నిర్ణయాలు’ అంటూ తాత్విక వ్యాఖ్యలు చేశారు. సుష్మ ప్రకటనను విపక్షాలు తిప్పికొట్టాయి. సుష్మ, మోదీ మరోసారి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. సుష్మ తప్పుచేయకపోతే ఈ వ్యవహారంపై మోదీ ఎందుకు విచారణ జరిపించరని సీపీఎం నిలదీసింది.