లోక్‌సభ బరిలో నటి నగ్మా
ఆమెకు యూపీలోని మీరట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్
మాజీ క్రికెటర్ అజహర్ సీటు మరొకరికి
మాజీ మంత్రి బన్సల్‌కు మళ్లీ టికెట్
71 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ తన రెండో జాబితాను గురువారం ఢిల్లీలో విడుదల చేసింది. తొలి జాబితాలోంచి నలుగురి పేర్లను మారుస్తూ రెండో జాబితాలో కొత్త పేర్లు ప్రకటించింది. ముందుగా మీరట్ స్థానానికి దయానంద్ గుప్తా పేరును ప్రకటించినా ఇప్పుడాస్థానంలో నగ్మాకు చోటు కల్పించారు. అలాగే రాయ్‌గఢ్ స్థానాన్ని మేనకాసింగ్‌కు బదులుగా ఆర్తీసింగ్‌కు, రాయ్‌పూర్ సీటును ఛాయా వర్మకు బదు లు సత్యనారాయణ్ శర్మకు, మేఘాలయలోని తురా స్థానాన్ని డి.జెన్నిత్ ఎం.సంగ్మాకు బదులు డారిల్ విలియం చైకు కేటాయించారు.
రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మరోవైపు మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని మొరాదాబాద్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. నిన్నటితరం బాలీ వుడ్ నటుడు రాజ్ బబ్బర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ స్థానం లభించింది. రైల్వేశాఖలో వెలుగుచూసిన ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంలో ప్రమేయం ఆరోపణల తో ఆ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్‌కుమార్ బన్సల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులెవరూ లేరు.
కాగా, ఈసారి తిరిగి టికెట్ దక్కించుకున్న కేంద్ర మంత్రుల్లో వీరప్ప మొయిలీ (చిక్‌బళ్లాపూర్), శశిథరూర్ (తిరువనంతపురం), నారాయణ సామి (పుదుచ్చేరి) ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే స్థానంతోపాటు ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఆరోపణలతో సీఎం పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాందేడ్‌కు అభ్యర్థిని ప్రకటించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.