
ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి.
న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఆయన నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్, ఇంటలెజిన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ సహా కేంద్ర హోంశాఖ సెక్రటరీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పుల్వామా ఘటనపై అనుసరించాల్సిన వ్యూహాలపై, జమ్మూ కశ్మీర్‌లో భద్రత పెంపుపై చర్చిస్తున్నారు. అదేవిధంగా జమ్మూ కశ్మీర్ విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుంగా చూసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజ్‌నాథ్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా పుల్వామా ఉగ్రదాడిపై చర్చించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో జరిగిన ఈ భేటీకి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది.