సాక్షి, న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌లు చేయడాన్ని తాము పలుచోట్ల అడ్డుకున్నామని హర్యానాలోని గుర్‌గావ్‌కు చెందిన హిందూ సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్‌గావ్ సమీపంలో 10 బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లను సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమితిలో భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, శివ్‌సేన, హిందూ జాగరణ్ మంచ్ తదితర పన్నెండు హిందూ సంస్థలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అఖిల భారత హిందూ క్రాంతి దళ్ జాతీయ సమన్వయకర్త రాజీవ్ మిట్టల్ పేర్కొన్నారు.
అధికారుల నుంచి అనుమతి తీసుకుని ప్రార్థనలు జరుపుకోవాలని తాము కోరామని, ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్య ఎక్కడా తలెత్తలేదని చెప్పారు. కాగా, గుర్‌గావ్ సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో 700 మంది మస్లింలు ఇటీవల బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని స్ధానికులు నిలిపివేసిన నేపథ్యంలో తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలంలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటున్నారని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్‌గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment