అప్పుడు.. ఇప్పుడు అక్కడ అదే జరుగుతోందా?
Published Sat, Nov 19 2016 5:33 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలోని స్వయం పాలన మండళ్ల పరిధిలో ఉన్న బ్యాంకుల్లో స్థానిక ఎస్టీలందరికి ఖాతాలున్నాయి. ఆ ఖాతాలు ఎక్కువగా ఆ రాష్ట్రాల్లోని ధనవంతులు తమ నల్లడబ్బును దాచుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వారికి ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో చట్ట ప్రకారం స్థానిక ఎస్టీలను ఎవరూ అడక్కూడదు.
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 10 (26) కింద ఈశాన్య రాష్ట్రాల్లోని అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాల్లో ఉన్న షెడ్యూల్డ్ తెగల వాళ్లు (ఎస్టీ) బ్యాంకుల్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. వారికి పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చిందని కూడా చట్టప్రకారం వారిని ప్రశ్నించరాదు. కొందరు స్థానిక ఎస్టీలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో రబ్బరు వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఎక్కువమంది కూలీలుగానే పనిచేస్తుంటారు. వారి వ్యాపారాలకు కూడా ఇచ్చి పుచ్చుకునే రసీదులు ఉండవు. పెద్ద ఎత్తున డబ్బును డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే రబ్బర్ బోర్డు నుంచి ఓ చిన్న రసీదును తీసుకొచ్చి చూపిస్తారు.
1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు స్థానిక ఎస్టీల ఖాతాలన్నీ కూడా నల్లడబ్బును మార్చుకునేందుకే ఎక్కువ ఉపయోగపడ్డాయని, ఇప్పుడు కూడా నల్లడబ్బును వారి ఖాతాల ద్వారా మార్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అప్పుడు షిల్లాంగ్‌లో ఎస్‌బీఐ చీఫ్ రీజనల్ మేనేజర్‌కు స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన నూరుల్ ఇస్లామ్ లష్కర్ తెలిపారు. షిల్లాంగ్‌కు 67 కిలోమీటర్ల దూరంలోని ఓ కుగ్రామానికి 1978లో తనను డిప్యూటేషన్ మీద పంపించారని, మొరార్జీ దేశాయి ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ కుగ్రామంలో ఊహించని రీతిలో బ్యాంక్ వద్ద రద్దీ పెరిగిందని, అందుకే ఆ బ్యాంకు సిబ్బందికి సహాయంగా తనను పంపించారని లష్కర్ వివరించారు.
తాను వెళ్లేటప్పటికి తమ బ్యాంకు ముందు స్థానిక ఎస్టీలు క్యూకట్టి నిలుచున్నారని, వారందరి వద్ద పెద్ద నోట్లు ఉన్నాయిని, అవన్ని ధనికులవేనన్న విషయం తమకు తెలుసునని చెప్పారు. నాడు అస్సాంలోని హసావో, కర్బీ ఆంగ్‌లాంగ్, బోడోల్యాండ్ టెరిటోరియల్ పరిధిలో, మేఘాలయలోని ఖాసి, జైంటియా, గారిహిల్స్‌తోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల పరిధిలోని బ్యాంక్‌లన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొందని, ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్ప తాము ఏం చేయలేకపోయామని లష్కర్ తెలిపారు. ఆ తర్వాత కూడా వారిపై ఆదాయపన్ను శాఖ అధికారులెవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని చెప్పారు. స్థానిక ఎస్టీలు కమీషన్లకు ఆశపడి ధనవంతుల నల్లడబ్బును దాచేవారని, చట్ట ప్రకారం ఇప్పటికీ వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉందని, ఇప్పుడు కూడా అక్కడ అదే జరుగుతుండవచ్చని ఆయన చెప్పారు. ఇదే విషయమై అగర్తలాలోని ఓ జాతీయ బ్యాంక్ సీనియర్ అధికారిని ప్రశ్నించగా నల్లడబ్బు మార్పిడి జరుగుతుండవచ్చని చెప్పారు. యాభైవేల రూపాయలకు పైబడిన డిపాజిట్లపైనా తాము నిఘా వేయగలంగానీ అన్నీ ఖాతాలపై నిఘా వేయడం కుదరని విషయమని ఆయన తెలిపారు.
బ్యాంకు అధికారుల సమన్వయంతో డబ్బుల లావాదేవీలపై తాము నిఘావేసి ఉంచామని, ఏ రూపంగా నల్లడబ్బు వచ్చినా పట్టుకుంటామని మిజోరమ్ ఆదాయంపన్ను కమిషనర్ సాంగ్లామా చెబుతున్నారు.
Advertisement
Advertisement