అమ్మానాన్న పొమ్మన్నారు... కలెక్టర్ ఆదుకున్నారు!
తిరువనంతపురం: హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం.. ఆ తర్వాత వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి(20) నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో గత నెలలో చోటచేసుకుంది. కన్నవాళ్లు కాదన్నా... జిల్లా కలెక్టర్ పి బాలకిరణ్ ఆమెకు అండగా నిలిచారు. ఆ యువతి(20) తిరిగి తన చదువును కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యువతిని తిరిగి కాలేజీలో జాయిన్ చేసి ఆమెకు మనోధైర్యాన్ని అందించారు. తనకు అన్ని విధాలా సాయం చేసిన కలెక్టర్ కు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ బుధవారం కాలేజీ విద్యార్థులు, ఆమె తల్లిదండ్రులకు హెచ్ఐవీపై అవగాహనా కల్పించడంతో పాటు యువతికి సహకరించాలని కౌన్సెలింగ్ నిర్వహించారు.
అసలు విషయం ఇది.. తనకు సోకిన వ్యాధి గురించిన విషయాన్ని ఇటీవలే ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థిని బయటపెట్టింది. ఆమెతో ఉండేందుకు తోటి విద్యార్థులు నిరాకరించారు. తోటి విద్యార్థినులు రూమ్స్ ఖాళీ చేయడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఆ కాలేజీ యాజమాన్యం అక్కడ నుంచి పంపేసింది. హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి వెళ్లగొట్టారు. కాలేజీ నుంచి పంపించిన విషయాన్ని ప్రిన్సిపాల్ పీఏ జునైద్ కూడా అంగీకరించారు. అయితే ఆ విద్యార్థిని ఇక ఏ గత్యంతరం లేక కన్నవారి వద్దకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కరువైంది. తనకు ఎవరూ అండగా లేరని మనస్తాపం చెందిన యువతి గత నెలలో ఆత్మహత్యకు యత్నించింది. చివరకు ఎలాగోలాగ ప్రాణాలతో బయటపడింది.