
అంకితభావంతో పనిచేయాలి
ఆయుర్వేద వైద్యులకు మోదీ సూచన
న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించేందుకు వైద్యులు అంకితభావంతో పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వైద్యులు అంకితభావంతో పనిచేసేవరకూ ఆయుర్వేదం అభివృద్ధి చెందదన్నారు. ఆదివారమిక్కడ 6వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘మీకు మీరు అంకితభావంతో పనిచేయకపోతే.. రోగులకు భరోసా ఎలా ఇస్తారు? నా మాటలు చేదుగా అనిపించవచ్చు. కానీ చేదు మాత్ర మంచి చేస్తుంది’ అని చమత్కరించారు.
అల్లోపతీ విధానం వ్యాధిని నయం చేస్తుందని, కానీ ఆయుర్వేదాన్ని పాటిస్తే భవిష్యత్తులోనూ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. మన పూర్వీకులకు ఆరోగ్యం జీవనంలో ఒక భాగం. కానీ మనం ఒక వైద్యుడి తర్వాత మరో వైద్యుడిని సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని ఔట్ సోర్సింగ్ చేసుకుంటున్నామన్నారు. అందుకే ఆయుర్వేదాన్ని వృత్తిలా కా కుండా మానవాళికి సేవగా గుర్తించాలన్నారు.