సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను దోషిగా తేల్చిన అనంతరం చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. హనీప్రీత్ బెయిల్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించిందని, అయితే ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దత్తపుత్రికగా చెబుతారు.
హింసను ప్రేరేపించారనడానికి ఆమెకు వ్యతిరేకంగా హర్యానా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ హనీప్రీత్ బెయిల్‌ను కోరుతున్నారని న్యాయవాది తెలిపారు.గత ఏడాది పంచ్‌కులలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన 15 మందికి వేర్వేరు కోర్టుల్లో బెయిల్ లభించిందని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనగా, ఆమె బెయిల్ అప్పీల్‌ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత ఏడాది ఆగస్ట్ 25న గుర్మీత్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఆరు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment