ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన ఎయిరిండియా, విస్తార విమానాలు
ముంబై : సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోని తమ ప్రాణాలు కలిసిపోతాయని భావించిన 261 మంది ప్రయాణికులు, ప్రమాదం నుంచి సెకన్లలో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళ పైలెట్ చూపించిన తెగువ ఇంతమంది ప్రాణాలను కాపాడ గలిగింది. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్‌లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి. విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్‌లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితమైన దూరంగా మరలించారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో, పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లి, తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తార విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment