ఖాకీల కాఠిన్యానికి అమాయకులు బలి!
ఢిల్లీ ఖాకీల దౌర్జన్యాలకు అమాయకుల జీవితాలు బలైపోతున్నాయి. పోలీసుల అనుమానాలు యువత భవితను అయోమయం చేస్తున్నాయి. జంతుశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, దక్షిణ కొరియాలో పీహెచ్ డీ చేసేందుకు స్కాలర్ షిప్ కూడ పొంది, పూనెలో టోఫెల్ పరీక్ష రాసేందుకు వెడుతున్న పర్వేజ్ అహ్మద్ రాడూ, ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నసమయంలో ... ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేయడం... అతడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అటువంటి యువత మరెంతోమంది ఖాకీ కాఠిన్యానికి జీవితాలనే కోల్పోతున్నారు.
2006 సెప్టెంబర్ 12... రాడూ జీవితంలో చీకటి రోజు... ఢిల్లీ ద్వారకా హోటల్లోని రహస్య ఛాంబర్ లో నిర్భంధించి, చిత్ర హింసలకు గురి చేసి, సుదీర్ఘ హింస పెట్టి, అనంతరం జైలుపాలు చేసిన రోజది. చివరకు ఏడేళ్ళ జైలు తర్వాత 2013 లో సెషన్స్ కోర్టు అతనిపై ఆరోపణలను కొట్టివేసి నిర్దోషిగా తేల్చింది. కానీ అప్పటికే రాడూ జీవితం నాశనమైపోయింది. ఆ పీహెచ్ డీ డ్రాపవుట్.. ప్రస్తుతం ఓ చిన్న డ్రైఫ్రూట్ హోల్ సేల్ షాప్ నడుపుతూ చాక్లెట్లు, కాండీలు అమ్ముకుంటున్నాడు. ఏడు సంవత్సరాల జైలు శిక్షతో కెరీర్ ను పూర్తిగా కోల్పోయాడు.
రాడూ కథలాగే మరో 24 కేసుల్లో . ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్టులు చేయగా... ఆరోపణలు, హింస, ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించి చివరికి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషులుగా వారిని విడిచిపెట్టినట్లు జామియా టీచర్స్ సాలిడారిటీ అసోసియేషన్ తయారుచేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. వీరిలో ఏడుగురు కాశ్మీర్ కు చెందిన ముస్లిం యువత ఉన్నారు.
ఢిల్లీ ఆర్చ్ స్ట్రీట్ బాంబ్ బ్లాస్ట్ కు కారకులైన జైషే ఇ మొహ్మద్ టీం లోని వ్యక్తిగా అనుమానించి రాడూను అరెస్టు చేసిన పోలీసులు టీం కమాండర్ ఆచూకీ కోసం కాశ్మీర్ లో కూడ గాలింపు చేపట్టారు. రాడూ తండ్రి సోపూర్ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. ఆయన అప్పట్లో హోం శాఖకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, మైనారిటీ కమిషన్ కు కూడ లేఖలు రాశారు. తమ కుమారుడికి ఎదో ఒకరకమైన ఉపశమనం దొరుకుతుందని ఎంతో వేచి చూశారు. కానీ అప్పట్లో వారికి ఎటువంటి సహాయం అందలేదు. అయితే సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ లో రాడూ మిలిటెంట్ అనేందుకు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో చివరికి నిర్దోషిగా విడిచి పెట్టారు. పర్వేజ్ ఎటువంటి మిలిటెంట్ ఆపరేషన్స్ కోసం ఢిల్లీ రాలేదని 2013 లో తేల్చి చెప్పారు. పోలీసులు తర్వాత హైకోర్టు లో వేసినా జడ్జిమెంట్ డిస్ మిస్ అయింది. అయితేనేం రాడూ కెరీర్ మాత్రం అంధకారంలో ములిగిపోయింది. జైలు నుంచీ వచ్చిన తర్వాత ఆరునెల్లపాటు కాశ్మీర్ లో ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ అతడి కేసు గురించి తెలిసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరికి ఓ సంవత్సరం క్రితం రాడూ చిన్న వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చింది. ''మా కొడుకు జీవితం ఇలా అయిపోతుందని మేమెప్పుడూ అనుకోలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాడూ తల్లిదండ్రులు. ఏది ఏమైనా కొడుకు అమాయకుడు అని తేలిందని, అల్లా న్యాయం చేశాడని సంతోష పడుతున్నారు.
ఢిల్లీ పోలీసుల అరాచకానికి ఒక్క రాడూనే కాదు... భారత దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధపడ్డాడంటూ ఆరోపణలతో అరెస్టు చేసి, సంవత్సరాల తరబడి విచారణ కొనసాగి చివరికి నిర్దోషులుగా తేలిన ముష్తాక్ అహ్మద్ వంటి ఎంతోమంది జీవితాలు బలైపోతున్నాయి. ఒక్కోసారి కేసులు ట్రయల్ కోర్టులోనే తేలిపోవడం ఉండదు. సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతూనే ఉంటాయి. అయితే చివరికి వారిని నిర్దోషులుగా తేల్చినా ఉపయోగం ఉండదు.
జామియా టీచర్స్ సోలిడారిటీ అసోసియేషన్ ఇచ్చిన 24 కేసుల నివేదిక ఆధారంగా చూస్తే సుమారు అన్ని కేసుల్లోనూ అదే పోలీసుల పేర్లు రిపీట్ అవడం గమనించాల్సిన విషయం. వారి కార్య నిర్వాహణ పద్ధతి హింసాత్మకంగా ఉండటంవల్లే ఇటువంటి కేసులు పునరావృతం అవుతున్నాయని, ఎంతోమంది అమాయకుల జీవితాలు బలైపోతున్నాయని అంటున్నారు. మరణించిన వారిగురించి చెడుగా మాట్లాడకూడదని తెలుసు.. కానీ ఇనస్పెక్టర్ బద్రీష్ దత్ గురించి మాట్లాడాల్సి వస్తోందంటే అతడు మా అందరికీ ఎంతో అన్యాయం చేశాడు. అతడి హింసాత్మక ప్రవర్తన ఎంతో మంది జీవితాలను అంధకారం చేసింది.అలాగే మరెంతోమంది పోలీసు అధికారులు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు రాడూ. ఇప్పటికైనా ఢిలీ పోలీసుల అరాచకత్వానికి యువత బలికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.