ఎంపీల భావప్రకటనా స్వేచ్ఛ ఎంత?
న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు విద్యార్థులు, అధ్యాపకులపై దేశద్రోహం కేసు పెట్టారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనంటూ ఓ వర్గం విద్యార్థులు ఆందోళను చేస్తున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో ఎంపీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతకు ఎంపీలకున్న భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంత?
రాజ్యాంగంలోని 105 (2) అధికరణ ఎంపీలకు భావ ప్రకటన స్వేచ్ఛ కల్పిస్తోంది. అయితే అవమానకరంగా, అసభ్యంగా, అన్పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే ఆంక్షల పరిధిలోకి వస్తుంది. పాలకపక్షం ఎంపీలు మాట్లాడితే ఆంక్షల పరిధిలోకి రాదు. ఒకరు మాట్లాడితే సభ్యత, మరొకరు మాట్లాడితే అసభ్యత. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థులు వివాదంపై లోక్ సభలో మాట్లాడుతూ 'దుశ్ఖర్మ' అనే పదాన్ని ఉపయోగించారు. అందుకు ఆమెను ఏమీ అనలేదు. అంతకుముందు జ్యోతిరాదిజ్య సింధియా అదే పదాన్ని ఉపయోగిస్తే అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి ఆ పదాన్ని రికార్డుల నుంచి కూడా తొలగించారు. మదర్ థెరిస్సా, షారూక్ ఖాన్లు సభకు 'అపరిచితులు' వారి గురించి సభలో ప్రస్తావించకూడదు. హిట్లర్, నాథూరామ్ గాడ్సే పేర్లను సభలో అస్సలు ప్రస్తావించరు. సభలో ఎవరినీ 'ఛోర్' అనిగానీ, 'నిరక్షరకుక్షి' అనిగాని సంబోధించరాదు.
'జోక్రాన్, చంచో, జూఠ్, ధోకా' లాంటి పదాలను ఉపయోగించడం కూడా బ్యాడ్ మ్యానర్సే. వీటికంటే సమానార్థాలున్న అసభ్య పదాలను మన ఎంపీలు ఉపయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పదాల సంగతి పక్కన పెడితే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవచ్చు. మైకులు విరగొట్టవచ్చు. చొక్కా, చొక్కా పట్టుకుని కుస్తీలకు దిగవచ్చు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దీన్ని స్వేచ్ఛ అందామా, దేశద్రోహం అందామా?