సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు.
ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి
పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు.
దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్‌లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment