పార్లమెంటులో సోమవారమూ నిరసనలు కొనసాగాయి. కేరళలో ప్రధాని మోదీ మంగళవారం పాల్గొనే మాజీ సీఎం ఆర్ శంకర్
లోక్‌సభలో కాంగ్రెస్ నిరసన; వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంటులో సోమవారమూ నిరసనలు కొనసాగాయి. కేరళలో ప్రధాని మోదీ మంగళవారం పాల్గొనే మాజీ సీఎం ఆర్ శంకర్ విగ్రహావిష్కణకు సీఎం ఊమెన్ చాందీని రావొద్దంటూ ఆహ్వానాన్ని వెనక్కు తీసుకోవడంపై లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఢిల్లీలో రైల్వే శాఖ గుడిసెలను కూల్చడంపై ఆప్ ఎంపీలూ గొడవ చేశారు. దాంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను కాసేపు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభమయ్యాక జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ చాందీ అంశాన్ని లేవనెత్తారు. శంకర్ విగ్రహావిష్కరణకు మోదీ హాజరవుతుండగా.. నిర్వాహకులైన ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం’ సంస్థచాందీని ఆహ్వానించి, తర్వాత రావద్దంటూ సూచించిందని మండిపడ్డారు.
ఇందులో ప్రధాని లేదా పీఎంఓ హస్తం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. నిరసనను కొనసాగించిన కాంగ్రెస్.. ఆప్, టీఎంసీ, ఎన్‌సీపీ, ఆర్జేడీలతో కలిసి వాకౌట్ చేసింది. పంజాబ్‌లో దళితులపై దాడలకు నిరసనగా రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. కాగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో కలసి పనిచేయడానికి ఉద్దేశించిన అణుశక్తి సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. తెలుగు భాషా ప్రచారానికి ప్రయత్నాలు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు.