
ఢిల్లీకి హైదరాబాద్ చాలా దూరమే: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఢిల్లీ బహుత్ దూర్ హై’ అంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలు నిజమే కదా అన్న తరహాలో ఆయన మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలను శనివారం ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘హైదరాబాద్ సే ఢిల్లీ కాఫీ దూర్ హై నా’ అని నవ్వుతూ బదులిచ్చారు. విభజన సమయంలో సీఎంగా ఉండటం దురదృష్టకరమని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘సీఎం వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు’ అని అన్నారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి మరింత గడువు ఇస్తారో లేదో వేచిచూద్దామన్నారు. సీఎం ఏఐసీసీ సమావేశానికి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. ‘ఏఐసీసీ సమావేశాల రోజున ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంది. అందుకే రాలేదు’ అని అన్నారు.
రాజ్యసభ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు, పార్టీ అయోమయంలో ఉన్నట్లుంది అని అనగా.. ‘రాజ్యసభ అభ్యర్థులపై సోనియా నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏఐసీసీకి తెలియజేస్తారు. ఇందులో అయోమయం లేదు. ఏఐసీసీకి అభ్యర్థుల జాబితా వచ్చాక మీరు వారి పేర్లు తెలుసుకోవచ్చు’ అని అన్నారు. రాజ్యసభ బరిలో నిలిచేందుకు జేసీ, గంటా శ్రీనివాస్‌రావులు ప్రయత్నిస్తున్నారని అనగా.. ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని బదులిచ్చారు.