రైతుల గురించి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారేకు ఏమీ తెలియదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ అన్నారు.
రైతుల గురించి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారేకు ఏమీ తెలియదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ అన్నారు. ఆయన కంటే తనకే వారి అవసరాలు ఎక్కువగా తెలుసని చెప్పారు. గురువారం భూవనరుల శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతుల సమస్యలపై హజారే నిరశన దీక్షను గురించి ప్రశ్నించగా బదులిచ్చారు. జంతర్ మంతర్ వద్ద ఎవరు దీక్ష చేస్తున్నారో ఎవరు చేయడం లేదో తనకు తెలియదని, అయినా తమ ప్రభుత్వమేమి రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పారు.
త్వరలో తీసుకురానున్న భూసేకరణ సవరణ బిల్లులో రైతులకు నాలుగింతల నష్ట పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులను తాము అర్ధం చేసుకున్నంతగా హజారే అర్ధం చేసుకోలేదని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు వారి గురించి ఏమి తెలియకపోయి ఉండొచ్చని అన్నారు. ఫిబ్రవరి 23న అన్నా హజారే కొంతమంది రైతులతో జంతర్ మంతర్ వద్ద భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.