
‘నువ్వేం ప్రధానివి కాదు కదా అన్నారు’
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిపై చేయిచేసుకుని విమానయాన సంస్థల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పార్లమెంటులో తన వివరణ ఇచ్చారు. ముందుగా సభలో ఈ విషయంపై మాట్లాడేలా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, దోషిని కాదని చెప్పారు.
మీడియానే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందన్నారు. అసలు తానెవరిపైనా చేయి చేసుకోలేదని, విమానంలో గందరగోళం సృష్టించానని చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని, తానలా చేయలేదని వివరణ ఇచ్చారు. తన సీటును ఓ సీనియర్ సిటిజన్‌కు ఇచ్చానని, కానీ, ఎయిర్ ఇండియా వాళ్లు మాత్రం కొత్త కథ అల్లేశారని ఆరోపించారు. తనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని, అయినా ఎకానమీ క్లాస్‌లో కూర్చునేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.
‘నువ్వేం ప్రధాని మోదీవి కాదు కదా, ఎంపీవీ అయితే మాకేమిటి అంటూ తిట్టారు. దీంతో నేను ఆ వ్యక్తిని విమానంలో నుంచి కిందికి దింపేశాను. అసలు నాపై హత్యా ప్రయత్నం ఆరోపణలు ఎలా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారో అర్ధం కావడం లేదు. నేను అంతగా చేసేందేమీ లేదు. విమానాల్లో ప్రయాణించడమనేది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును ఎయిర్ లైన్స్ సంస్థ ఎలా కాదంటుంది? ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సిందే. ఢిల్లీ పోలీసులు చాలా అతి చేశారు. నాపై హత్య ఆరోపణలు అసలు ఎందుకు పెట్టారు? నా కుటుంబానికి ఏడు టికెట్లు ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం.
నేను ఎయిర్ ఇండియాపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నాపై నమోదుచేసిన ఆరోపణలన్నింటిని తీసేయాలని హోమంత్రిని సభ ముఖంగా కోరుతున్నాను. సభలో ఉన్న సభ్యులంతా నా ఆవేదనను అర్ధం చేసుకొని నాకు మద్దతిస్తారని భావిస్తున్నాను. ఒక వేళ సభ సభ్యులు నా ప్రవర్తనతో బాధపడితే క్షమించండి. అంతేగానీ, నేను ఎయిర్ ఇండియాకు మాత్రం క్షమాపణలు చెప్పబోను’ అని అన్నారు.
ఆయనకే మద్దతిస్తూ మరో శివసేన ఎంపీ అనంత్ గీతే మాట్లాడుతూ దర్యాప్తు జరగకుండానే ఒక ఎంపీపై ఎలా నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. దీంతో ప్రజల భద్రతే తమకు ముఖ్యం అని, ఈ విషయంలో అస్సలు రాజీపడబోమంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది.
దీంతో లోక్‌సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ వెంటనే శివసేన ఎంపీలు మంత్రి అశోక్ గజపతి రాజును చుట్టుముట్టారు. ఫలితంగా బీజేపీ, శివసేన ఎంపీల మధ్య వాడివేడి వాగ్భానాలు ఎదురయ్యాయి. శివసేన ఎంపీలయితే ముంబయి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తామని హెచ్చరించారు. ఇదిలా కొనసాగుతుండగానే స్పీకర్ మహాజన్ ఈ విషయంపై ఏం చేద్దామని ప్రత్యేకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజుతో సమావేశం నిర్వహిస్తున్నారు.