'వారికి సెల్యూట్ చేస్తూనే ఉంటాను'
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనవారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
దాడి సమయంలో ధీటుగా పోరాడి పార్లమెంటులోకి ఉగ్రవాదులను అడుగుపెట్టకుండా చేసి ప్రాణాలు తృణపాయంగా వదిలేసిన వారి త్యాగాలకు తానెప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటానని అన్నారు. వారి త్యాగం భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో అసహనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు నిరంతరం కృశిచేస్తుందని అన్నారు. భారత్ ను మరింత సురక్షితమైన దేశంగా మార్చేందుకు, మరింత లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దేందుకు అనునిత్యం ప్రయత్నిస్తామని అన్నారు.