‘గాయత్రిని జైలులో వేస్తే చూడాలని ఉంది’
న్యూఢిల్లీ: తనపై లైంగిక వేధింపులకు, తన తల్లిపై వరుసగా అత్యాచారానికి పాల్పడిన ప్రజా ప్రతినిధి సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి, అతడి సహచరులు జైలుకి వెళితే చూడాలని ఉందని బాధితురాలైన మైనర్ చెప్పింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎయిమ్స్ ఆస్పత్రి వద్దకు బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు బయలుదేరిన నేపథ్యంలో ఆమె తన కోరికను మీడియాకు చెప్పింది.
‘ఈ కేసులో మైనర్ తప్ప ఇతర బాధితులు, వారికి సంబంధించిన వారందరి వాంగ్మూలం నమోదు చేసుకున్నాం. ప్రస్తుతం మైనర్ బాలిక ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడికి మా పోలీసు బృందం వెళ్లింది. వైద్యులు అనుమతించడంతో మా బృందం అక్కడికి వెళ్లింది’ అని అడిషనల్ డీజీపీ దల్జీత్ చౌదరి చెప్పారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో దాదాపు కోమా స్టేజీలోకి వెళ్లి తిరిగొచ్చింది. అయినప్పటికీ భయంభయంగా ఉంటూ ఆస్పత్రిలో అర్థరాత్రి కేకలు పెట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదంతా కూడా గత చెడు అనుభవం ప్రభావంతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ, ప్రజాపతి, అతడి గ్యాంగ్‌ను ఆమెను ఏదో చేసేందుకు వస్తున్నారనే భయంతోనే ఉందని, వారిని జైలులో పెడితే చూడాలని కోరుకుంటుందని సమాచారం. ‘నన్ను రేప్ చేయాలని ప్రయత్నించిన ప్రజాపతి అతడి ముఠాను జైలులో పెట్టాలి. అతడు మా జీవితం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మేం ఇళ్లు విడిచిపెట్టేశాం’ అని మైనర్ బాధితురాలు చెప్పింది.
సమాజ్ వాది పార్టీలో మంచి పొజిషన్ ఇస్తానని నమ్మబలికించి తీసుకెళ్లి తొలుత ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ప్రజాపతి, అతడి సహచరులు, అనంతరం వీడియోలు తీసి బెదిరించి వరుసగా రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 2016లో ఓసారి ఆమె కూతురు అయిన మైనర్‌పై కూడా లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో ఆ మైనర్ భయంతో ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే గాయత్రి ప్రజాపతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను అజ్ఞాపించింది.