ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తా...
న్యూఢిల్లీ: తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తాననని ఎంపీ కీర్తీ అజాద్ భార్య బీజేపీ అధికార ప్రతినిధి పూనమ్ అజాద్ తెలిపారు. తనకు, తన భర్తకు బీజేపీ అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. బీజేపీ సిద్ధూ చేసిన ఆరోపణలు ముమ్మాటికీ వాస్తవమేనన్నారు. ఆయన మూడుసార్లు అమృత్సర్ నుంచి ఎంపీగా గెలుపొందడంతో పాటు, పార్టీ కోసం దేశవ్యాప్తంగా అనేకసార్లు ప్రచారం చేశారని పూనమ్ పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తిని మొన్నటి ఎన్నికల్లో పక్కనపెట్టారని.. ఇదేవిధంగా తనతో పాటు తన భర్తకూ బీజేపీ అన్యాయం చేసిందన్నారు. కాగా, ఆప్ లో చేరుతున్నారా అని ప్రశ్నించగా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. డీడీసీఏ కుంభకోణానికి సబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేయడంతో ఎంపీ కీర్తి అజాద్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడడం వల్ల లోక్ సభ సభ్యునిగా ఉన్న అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో కీర్తీ అజాద్ తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది.