
జమ్మూ: భారత వైమానిక దళం సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కాపాడారు. జమ్మూకు చెందిన నలుగురు మత్స్యకారులు జమ్మూలోని భగవతి నగర్ వద్ద తావీ నదిలోకి దిగారు. ఒక్కసారిగా నదిలో వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌పైకి ఎక్కారు. అంతకంతకు నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికుల సాయంతో అధికారులకు సమాచారం అందించారు. ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ హెలికాప్టర్ పిల్లర్‌కు అతి సమీపానికి రాగా గరుడ్ కమాండో కింది దిగారు. అక్కడున్న ఇద్దరినీ సురక్షితంగా హెలికాప్టర్‌లోకి ఎక్కేలా చేసి, మరో ఇద్దరి కోసం తాడు నిచ్చెనను వదిలారు. అయితే, వారిద్దరూ పైకి ఎక్కలేక తిరిగి నీళ్లలో పడిపోయారు.
దీంతో గరుడ్ కమాండోలు తిరిగి పిల్లర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని, వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చేయగలిగారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ సాహసోపేత చర్యను స్థానికులు ఉత్కంఠగా తిలకించారు. నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఐఏఎఫ్ సిబ్బంది సాహసాన్ని వారు కొనియాడారు. ఇది డేర్‌డెవిల్ ఆపరేషన్ అని ఐఏఎఫ్ అధికారులు అభివర్ణించారు. ఇదంతా హెలికాప్టర్ పైలెట్, గరుడ్ కమాండో మధ్య సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు. నగరంలోని హర్కిపౌడి ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో.. ఉధంపూర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ తావి నది వరదలో చిక్కుకుపోగా పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.