నేను ముస్లింనే.. ఉగ్రవాదిని కాను | iam a muslim, but not a terrorist, says umar khalid | Sakshi
Sakshi News home page

నేను ముస్లింనే.. ఉగ్రవాదిని కాను

Published Mon, Feb 22 2016 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

నేను ముస్లింనే.. ఉగ్రవాదిని కాను

నేను ముస్లింనే.. ఉగ్రవాదిని కాను

గడిచిన ఏడేళ్లుగా తాను జేఎన్‌యూ క్యాంపస్‌లో ఉన్నానని, అయితే ఈ ఏడేళ్లలో ఎప్పుడూ తనను తాను ముస్లింగా భావించలేదు గానీ, ఈ పది రోజుల్లో మాత్రం అలాగే అనుకునేలా చేశారని రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ అన్నాడు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే క్యాంపస్ నుంచి ఉమర్ అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కన్హయ్య, ఉమర్ నాయకత్వం వహించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఎట్టకేలకు ఆదివారం నాడు ఉమర్‌ ఖలీద్ జేఎన్‌యూ క్యాంపస్‌కు మళ్లీ వచ్చాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పాడు. తాను ఉమర్‌నే గానీ, ఉగ్రవాదిని మాత్రం కాదని స్పష్టం చేశాడు. కేవలం మీడియా మాత్రమే తనపై ఉగ్రవాదిగా ముద్ర వేసిందని మండిపడ్డాడు. ఫిబ్రవరి 9వ తేదీన అఫ్జల్‌గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం వల్ల యూనివర్సిటీపై దాడి జరగలేదని.. ప్రభుత్వం తమపై దాడి చేయడానికి ఒక సాకు వెతుక్కుందని అన్నాడు. ఇదే సమయంలో మీడియా తన గురించి చాలా విషయాలు ప్రచారం చేసిందని, దీనివల్ల తన కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని అన్నాడు.

ఉమర్ ఖలీద్ క్యాంపస్‌ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత అతడు జైషే-ఇ-మహ్మద్ సానుభూతిపరుడన్న ప్రచారం జరిగింది. తీవ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 9వ తేదీ కార్యక్రమానికి ముందు.. వారం వ్యవధిలో ఉమర్ గల్ఫ్‌ దేశాలకు లేదా కశ్మీర్ ప్రాంతానికి దాదాపు 800 ఫోన్ కాల్స్ చేసినట్టు అతడి ఫోన్ కాల్ డేటాలో వెల్లడైంది. దాన్ని కూడా ఉమర్ ఖండిస్తున్నాడు. తాను అసలు అన్ని కాల్స్ చేయనే లేదన్నాడు. మీడియా ఏం కావాలంటే అది రికార్డు చేసుకోవచ్చని, అయితే టేపులను మాత్రం మార్చి ప్రసారం చేయొద్దని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement