'యోగా డే వేడుకలపై దాడులు జరగొచ్చు'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని నగరంలో ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) హై అలర్ట్ జారీ చేసింది. యోగా డే దినం ఉత్సవాల వేదిక రాజ్పథ్ ఆవరణలో దాడులు జరిగే అవకాశం ఉందని... అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. ఆకాశంలో ఎగిరే బెలూన్లు, గాలిపటాలు లాంటి.. వాటి ద్వారా ఈ దాడులు జరగడానికి ఆస్కారం ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో బెలూన్లు, గాలిపటాలు ఎగరవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. అలాగే ఆకాశం నుంచి ఫోటోలు తీయడాన్ని కూడా నిషేధించారు.
మరోవైపు దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలకు భారీ సన్నాహకాలు జరిగాయి. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. 30 కంపెనీల రక్షక దళాలు రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అయిదు వేలమంది సాయుధ రక్షక్ష భటులతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా రాజపథ్ చుట్టూ మోహరించారు.
అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ శ్వాస నియంత్రణ, ఇతర యోగాసనాలను ప్రదర్శించనున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు అధికారులు , ఎన్సీసీ తదితరులతో కూడిన సుమారు 35 వేలమంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు.