సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ ఎన్‌కౌంటర్’ ఘటన నిజమైనదా, బూటకమా! అన్న అంశంలో ఎన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు చేసిందీ సబబేనంటూ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. అలా అని పోలీసులు కాకుండా న్యాయవ్యవస్థ నేరస్థులకు ఉరిశిక్ష విధించి ఉంటే బాగుండేదని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ వ్యాఖ్యానించడం, తమ పేరు మీద పోలీసులు తమ చేతుల్లోకి న్యాయాధికారాలు తీసుకోవడం సమంజసం కాదంటూ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం సుప్రీం కోర్టుకెళ్లడం పరిణామాలను పట్టించుకోకుండా ఉండలేం.
ఎందుకంటే హర్యానాలోని గురుగావ్ పోలీసులు అక్కడి ‘ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో జరిగిన ఓ విద్యార్థి కేసులో తిమ్మిని బమ్మిని చేశారు. 2017, సెప్టెంబర్ 8వ తేదీన ఆ స్కూల్ బాత్‌రూమ్‌లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి హత్య జరగ్గా, స్కూల్ యాజమాన్యం ఒత్తిడి మేరకు గురుగావ్ పోలీసులు ఆ స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్‌పై కేసు పెట్టారు. తీవ్రంగా హింసించి నేరాన్ని ఒప్పించారు. వాంగ్మూలం కూడా తీసుకొన్నారు. బాత్ రూమ్‌లో పిల్లాడిపై లైంగిక దాడి చేయబోతే అరవడంతో జేబులో నుంచి చాకును తీసి మెడ నరం కోశానని, చనిపోయాడని కండక్టర్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ చాకును తాను యూపీలోని ఆగ్రాలో కొనుగోలు చేసినట్లు కండక్టర్ చెప్పగా, తాము అతన్ని ఆగ్రా తీసుకెళ్లి ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని కూడా పోలీసులు దర్యాప్తు రిపోర్టులో రాసుకున్నారు.
మైనర్ బాలుడిపై హత్యాచారం జరిపిన కామాంధుడైన కండక్టర్‌ను కాల్చి పారేయాలంటూ నాడు ప్రజలు ఆందోళన చేశారు. చాకును ఆగ్రాలో కొన్నానని చెప్పిన కండక్టర్‌ను చాకు కోసం ఆగ్రాకు ఎందుకు వెళ్లావని మీడియా ప్రశ్నించగా, బస్సు టూల్ బాక్స్‌లో ఉంటే తీసుకున్నానని కండక్టర్ మాట మార్చడం, టూల్ బాక్సులో చాకు ఎందుకు ఉందని డ్రైవర్‌ను ప్రశ్నించగా లేదని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. మానవ హక్కుల సంఘాల డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించగా అసలు విషయం బయట పడింది.
అదే పాఠశాలలో చదువుతున్న ఓ 16 ఏళ్ల యువకుడు ఆ బాలుడిని హత్య చేశాడని తేలింది. పాఠశాలకు సెలవు ఇస్తారని తానే ఆ బాలుడిని చంపానని ఆ యువకుడు నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ కుమారుడి తండ్రికి డబ్బుతోపాటు రాజకీయ పలుకుబడి ఉండడంతో కేసు తప్పుదారి పట్టింది. ప్రజల డిమాండ్ మేరకు నాడే గురుగావ్ పోలీసులు ఆ కండక్టర్‌ను కాల్చివేసి ఉంటే ఏమయ్యేది? నిజం బయటకు వచ్చేదా? ‘ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్’ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో పోలీసుల చేతుల్లో ఎన్నో కేసులు తారుమారయ్యాయి.
ఉత్తర ప్రదేశ్‌లో నేరాలను, ఘోరాలను అరికట్టడం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఫలితంగా ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిల్లో మరణించిన వారిలో అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే భారత రాజ్యాంగంలో పోలీసులు, న్యాయ వ్యవస్థ విధులు వేర్వేరుగా ఉన్నాయి. అందుకే ఎవరి విధులు వారే నిర్వహించాలని ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment