ఇళయరాజాకు పద్మవిభూషణ్‌ | Ilayaraja gets Padma Vibhushan Award | Sakshi
Sakshi News home page

ఇళయరాజాకు పద్మవిభూషణ్‌

Published Fri, Jan 26 2018 2:17 AM | Last Updated on Fri, Jan 26 2018 2:18 AM

Ilayaraja gets Padma Vibhushan Award - Sakshi

పరమేశ్వరన్, గులాం ముస్తఫా ఖాన్‌

న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులు, అద్భుతమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నా ఇన్నాళ్లుగా సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలకు పద్మ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది.  మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా (74)తో పాటుగా హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు కూడా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ జాబితాలో పేదలకు సేవ చేసిన వారికి, ఉచిత పాఠశాలలు ఏర్పాటుచేసిన వారికి గిరిజన కళలకు ప్రపంచ ప్రఖ్యాతి అందించిన వారికి చోటు కల్పించింది.

పద్మ భూషణ్‌ జాబితాలో ప్రముఖులు
పద్మ భూషణ్‌ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, బిలియర్డ్స్‌ ప్రపంచ చాంపియన్‌ పంకజ్‌ అడ్వాణీ,  గోవా చిత్రకారుడు లక్ష్మణ్‌ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్‌ మార్‌ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్‌ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అభయ్‌ బంగ్‌–రాణిబంగ్‌ (సంయుక్తంగా వైద్యరంగం)–మహారాష్ట్ర, దామోదర్‌ గణేశ్‌ బాపత్‌ (సామాజికసేవ)–ఛత్తీస్‌గఢ్, సైకోమ్‌ మీరాబాయ్‌ చాను (వెయిట్‌లిఫ్టింగ్‌)– మణిపూర్‌ తదితరులు పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వారికి సరైన గౌరవం కల్పిస్తామని చెబుతూ వస్తు న్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు తగ్గట్లుగా నే.. సామాజిక సేవ చేస్తున్న వారికి పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది.  

అవార్డు గ్రహీతల్లో విదేశీయులు!
ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురు మరణానంతరం పద్మ అవార్డులు అందుకోనున్నారు. భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్‌ కడాకిన్‌కు (మరణానంతర) పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. వాణిజ్యరంగంలో సేవలకు గానూ ఫిలిప్పీన్స్‌కు చెందిన జోస్‌ మాజోయ్, మలేసియాకు చెందిన నృత్యరంగ ప్రముఖుడు రామ్‌లీ బిన్‌ ఇబ్రహీం, బౌన్‌లాప్‌ కియోకంగ్నా (లావోస్‌), టామీ కో (సింగపూర్‌), హున్‌ మెనీ (కంబోడియా), నౌఫ్‌ మార్‌వై (సౌదీ అరేబియా), తోమియో మిజోకమి (జపాన్‌), సోమ్‌డెట్‌ ఫ్రా మా (థాయ్‌లాండ్‌), థాంట్‌ మైయింట్‌ (మయన్మార్‌), ఐ న్యోమన్‌ నౌతా (ఇండోనేసియా), మలై హాజీ అబ్దుల్లా (బ్రూనై దారుస్సలాం), హబీబుల్లో రాజా బౌ (తజకిస్తాన్‌), డాక్టర్‌ సందుక్‌ రుయిత్‌ (నేపాల్‌), ఎన్‌గుయెన్‌ తీన్‌ (వియత్నాం)లు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు.

పద్మవిభూషణ్, పద్మభూషణ్‌ విజేతలు

పద్మవిభూషణ్‌: ఇళయరాజా (సంగీతం)–తమిళనాడు, గులాం ముస్తఫాఖాన్‌ (సంగీతం)–మహారాష్ట్ర, పరమేశ్వరన్‌ పరమేశ్వరన్‌ (సాహిత్యం, విద్యారంగం)– కేరళ.

పద్మ భూషణ్‌: మహేంద్ర సింగ్‌ ధోనీ (క్రికెట్‌)–జార్ఖండ్, పంకజ్‌ అడ్వాణీ (బిలియర్డ్స్‌)– కర్ణాటక, ఫిలిపోస్‌ మార్‌ క్రిసోస్టోమ్‌ (ఆధ్యాత్మికం)–కేరళ, అలెగ్జాండర్‌ కడాకిన్‌ (ప్రజాసంబంధాలు)–రష్యా (మరణానంతర/విదేశీ), రామచంద్రన్‌ నాగస్వామి (పురాతత్వ విభాగం)–తమిళనాడు, వేదప్రకాశ్‌ నంద (సాహిత్యం, విద్యారంగం)–అమెరికా, లక్ష్మణ్‌ పాయ్‌ (కళారంగం)–గోవా, అరవింద్‌ పారిఖ్‌ (సంగీతం)–మహారాష్ట్ర, శారదాసిన్హా (సంగీతం)–బిహార్‌.  

మట్టిలో మాణిక్యాలు
పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో కొందరు

లక్ష్మీ కుట్టి:
కేరళకు చెందిన గిరిజన మహిళ ఈమె. 500 రకాల మూలికలతో మందులను తయారుచేసి వేల మంది గిరిజనులకు వైద్యసాయం అందిస్తున్నారు. కొండల్లో ఉంటూ పాముకాటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యంతో ప్రాణాలు కాపాడుతున్నారు. కేరళ ఫోక్‌లోర్‌ అకాడమీలో చదువు చెప్పే లక్ష్మి కుట్టి.. అడవిలో గిరిజనులతో కలిసి తాటిచెట్టు ఆకులతో చేసిన చిన్న గుడిసెలో నివసిస్తున్నారు.  

అరవింద్‌ గుప్తా:
ఐఐటీ కాన్పూర్‌లో విద్యనభ్యసించారు. చెత్తనుంచి సైన్స్‌ను నేర్చుకోవటంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు. నాలుగు దశాబ్దాల్లో 3వేల పాఠశాలలను సందర్శించి.. పనికిరాని వస్తువుల సాయంతో బొమ్మలను రూపొందించటంపై 18 భాషల్లో 6,200 లఘుచిత్రాలను రూపొందించారు. 1980ల్లో తరంగ్‌ పేరుతో విద్యార్థులకోసం టీవీషోను నిర్వహించారు.  

భజ్జు శ్యామ్‌:
అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన గోండు చిత్రకారుడు భజ్జు శ్యామ్‌. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన భజ్జు శ్యామ్‌ రాత్రి వాచ్‌మన్‌గా, ఎలక్ట్రిషియన్‌గా కుటుంబ పోషణ చేసేవారు అనంతరం ప్రొఫెషనల్‌ ఆర్టిస్టుగా యురప్‌లో గోండు పెయింటింగ్స్‌ (మధ్యప్రదేశ్‌లోని గిరిజన సంప్రదాయ చిత్రకళ) ద్వారా ప్రాముఖ్యత సంపాదించారు. ఐదు విదేశీ భాషల్లో ఈయన రూపొందించిన ‘ద లండన్‌ జంగిల్‌ బుక్‌’ 30వేల కాపీలు అమ్ముడుపోయింది.

సుధాంషు బిశ్వాస్‌:
99 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు. ఇప్పటికీ పేదల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు. వీరికోసం పాఠశాలలు, అనాథాశ్రమాలు ఏర్పాటుచేశారు.

మురళీకాంత్‌ పేట్కర్‌:
1965 భారత్‌–పాక్‌ యుద్ధంలో భుజం తెగిపడినా తెగువప్రదర్శించారు. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించారు.  

ఎమ్‌ఆర్‌ రాజగోపాల్‌:
కేరళలో సుపరిచితమైన వైద్య ప్రముఖుడీయన. నవజాత శిశువులకు సంబంధించిన వైద్యం ఈయన ప్రత్యేకత.  

సుభాషిణి మిస్త్రీ:
గ్రామీణ పశ్చిమబెంగాల్‌లోని పేద మహిళ. ఈమె 20 ఏళ్లపాటు ఇళ్లలో పాచిపని, రోజూవారీ కూలీగా పనిచేసి పేద ప్రజల కోసం హాస్పిటల్‌ కట్టించారు.

రాజగోపాలన్‌ వాసుదేవన్‌:
భారత్‌లో ప్లాస్టిక్‌ రోడ్ల తయారీతో ఈయన ప్రాచుర్యం పొందారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లను నిర్మించటంలో సృజనాత్మక పద్ధతుల్లో ప్రయత్నించినందుకు పెటెంట్‌ కూడా పొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement