
యోగిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఫైర్
లక్నోః ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశంపై దృష్టి సారించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు. గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో 30 మంది చిన్నారులు మరణించిన ఉదంతాన్నీ ఈ సందర్భంగా యోగితో భగవత్ ప్రస్తావించారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఠాకూర్లు, దళితుల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకోవడం, మహిళలపై లైంగిక దాడులు పెచ్చుమీరడం పట్ల ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల మూడు రోజుల సమన్వయ సదస్సు నేపథ్యంలో సీఎం యోగి, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో గోరఖ్‌పూర్ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భగవత్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎంకు సూచించారు.
మరోవైపు ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రజలపై చూపిన ప్రతికూల ప్రభావంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. నోట్ల రద్దుతో ఆశించిన ఫలితం చేకూరకపోగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీకి పూర్తి మద్దతుగా నిలిచే చిన్న వ్యాపారులు నోట్ల రద్దుతో తీవ్రంగా దెబ్బతిన్నారని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు అనుబంధ సంఘాల సమన్వయ భేటీలో పేర్కొన్నారు.