నరేంద్రమోదీ జన్మదినం.. 4 గిన్నీస్ రికార్డులు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 66 వ పుట్టిన రోజు వేళ సంక్షేమ కార్యక్రమాలతో నాలుగు గిన్నీస్ రికార్డును నెలకొల్పేందుకు బీజేపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 17 న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నవ్సారీలో 11,000 మంది దివ్యాంగులను ఒక చోట చేర్చి వారికి అవసరమైన వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.7.5 కోట్లను ఖర్చు చేయనున్నారు.
1000 మంది వికలాంగులకు వీల్ చైర్లు, మరో వెయ్యి మంది వినికిడిలోపం గల వారికి హియరింగ్ మిషిన్లను ఒకే సారి పంపిణీ చేస్తారు. అనంతరం 1000 మంది దివ్యాంగులతో కలిసి దీపాలతో ర్యాలీగా ప్రదర్శనను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 346 మందికి శారీరక వికలాంగులకు వీల్ చైర్లను అమెరికా అందించగా, ఆస్ట్రేలియా 500 మందికి వినికిడి యంత్రాలను అందించిన రికార్డు ఆయా దేశాల పేరుతో ఉంది. దీంతో ఇప్పటి వరకూ ఆయాదేశాల పేరుతో ఉన్న గిన్నీస్ రికార్డు బద్దలు కానుంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో సర్వేలు సైతం పూర్తయ్యాయని దివ్యాంగుల సంక్షేమ అధికారులు తెలిపారు.