వేశ్యాగృహాల నుంచి తరలింపును అడ్డుకోజాలరు
సెక్స్ వర్కర్ల పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వేశ్యాగృహాల నుంచి తరలింపును అడ్డుకునేందుకు సెక్స్ వర్కర్లు చట్టాలను ఉపయోగించుకోజాలరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ దోషిగా తేలినా.. లేక పోలీసులకు చిక్కకపోయినా వారిని వేశ్యాగృహాల నుంచి తరలించకుండా చట్టప్రకారం రక్షణ పొందే అవకాశం సెక్స్ వర్కర్లకు లేదని పేర్కొంది. వేశ్యా గృహం నుంచి తరలించడానికి ముందుగా అక్కడున్న వారికి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాలన్న సెక్స్ వర్కర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
చట్ట ప్రకారం అందరికీ నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదంది. ముగ్గురు ఢిల్లీ సెక్స్ వర్కర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. వేశ్యాగృహాలను మూసేయాలని, అక్కడ ఉండే పరిస్థితుల బట్టి సెక్స్ వర్కర్లను తరలించాలని చట్టంలోని సెక్షన్ 18 చెపుతోందని పేర్కొంది.