'శశికళ మాకొద్దు.. అస్సలు రావొద్దు'
చెన్నై: 'చిన్నమ్మ(శశికళ) ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ ఆర్కే నగర్ వాసులు అంటున్నారు. ఆర్‌కే నగర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసేవారు. అక్కడి ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం.
ఆమె చనిపోవడంతో ప్రస్తుతం అదే చోటు నుంచి ప్రస్తుతం పార్టీ పగ్గాలు చేతబట్టి ముఖ్యమంత్రి పదవికై సాగుతున్న శశికళ పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడి ప్రజల నుంచి శశికళకు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడి వారంతా శశికళను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని అంటున్నారు. ఇది జయమ్మ చోటని శశికళను అనుమతించం అంటున్నారు. 'మా అమ్మ (జయలలిత) 77 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు.
ఒక్కరోజైనా శశికళ మాకు చూపించారా. జయ మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలి. ఆమె మాత్రం మా జయలలిత వారసత్వాన్ని కొనసాగించాల్సింది' అంటూ ఆర్కే నగర్ వాసులు అంటున్నారు. ఇప్పటి కొంతమంది గ్రూపులుగా వెళ్లి శశికళ ఆర్కే నగర్ నుంచి పోటీ చేసేందుకు రావొద్దని, తమను ఓట్లు అడగవద్దని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధురై నియోజవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే శశికళకు కొందరు పార్టీ సీనియర్లు సూచించారు. ఏదేమైనా ఆర్‌కే నగర్ ప్రజలు శశికళపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకోవడం కొంత ప్రాధాన్యం సంతరించుకుంది.