'ఖామోష్' అంటూ శత్రుఘ్నసిన్హా జీవితచరిత్ర
న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు, రాజకీయ నాయకుడు షాట్గన్గా పేరొందిన శత్రుఘ్న సిన్హా. పదునైన వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులనే కాదు సొంత పార్టీ నేతలనూ ఇరకాటంలో పడేయడం ఆయన స్టైల్. తాజాగా ఆయన జీవిత కథ 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరిట విడుదల కానుంది. ఈ నెల 6న ఢిల్లీలోని క్లారిడ్జ్స్ హోటల్లో ఈ పుస్తకాన్ని ఆయన రాజకీయ గురువు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ విడుదల చేయనున్నారు. ఈ పుస్తకావిష్కరణకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా హాజరుకానున్నారు.
ప్రస్తుత రాజకీయ సందర్భానికి అనువైన శీర్షికతో (ఖామోష్-నిశ్శబ్దం)తో జీవితకథను వెలువరిస్తున్న శత్రుఘ్న.. ఈ పుస్తకానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌తో ముందుమాట రాయించారు. ఇప్పటికే బీజేపీలో అసమ్మతి ఎంపీగా ముద్రపడ్డ శత్రుఘ్న తాజా చర్యతో మరింత వివాదాలు రాజేసే అవకాశం లేకపోలేదు. 2008 నుంచి శత్రుఘ్నతో వ్యక్తిగతంగా నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా భారతీ ఎస్ ప్రధాన్ ఈ జీవిత కథను రాశారు. 'నిజాయితీతో వెలువడుతున్న జీవిత కథ ఇది. ఇందులో శత్రుఘ్న గురించి ప్రశంసలే కాదు చాలా విషయాలు ఉంటాయి' అని రచయిత్రి భారతి తెలిపారు.