
గీత దాటిన డిపాజిట్.. ఐటీ అటాక్
గ్యాంగ్టక్(సిక్కిం): నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్లను తక్కువ మొత్తంలోనే మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడానికి రూ. 2.5 లక్షలకు పైగా డబ్బును బ్యాంకులో జమ చేసిన ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ గురి పెట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాల్లో భారీ నగదు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు నివేధికలు తెప్పిస్తూనే ఉంది.
దీనిలో భాగంగానే సిక్కింలోని గ్యాంగ్టక్లోని సితారామ్ ఎంటర్ ప్రైజెస్కు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కింకు చెందిన సితారామ్ ఎంటర్ ప్రైజెస్ అకౌంట్లో నవంబర్ 12 నుంచి 14 మధ్య జరిపిన లావాదేవీలపై ఈ నెల 25న వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొంది. నవంబర్ 13న సదరు కంపెనీ అకౌంట్లో 4,51,000 రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సమర్పించవల్సిందిగా సిలిగురి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదాయపన్ను చెల్లించినట్టయితే దానికి సంబందించి నఖలును సమర్పించాలని నోటీసులో పేర్కొంది.
మరో వైపు నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే కఠినచర్యలు తప్పవని..ఖాతాలు దుర్వినియోగమైతే సొంతదారుపై ఐటీ చట్టం కింద విచారణ జరిపిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నల్లధనం నిర్మూలనకుఅందరూ సహకరించాలని కోరింది.