మారిషస్‌కు 3,227 కోట్ల సాయం
న్యూఢిల్లీ: మారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. సముద్ర తీర భద్రత విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, మారిషస్ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ రుణ సాయం చేసింది.
భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీ చేరుకున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
సముద్ర తీర భద్రతా ఒప్పందంపై సంతకాలు
అనంతరం హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్స్ రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.
అందుకే తాను, జగన్నాథ్ సముద్ర తీర భద్రతపై ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఈ ఒప్పందంతో పాటు ఇరుదేశాల మధ్య మరో మూడు ఒప్పందాలు కూడా జరిగాయి. మారిషస్‌లో సివిల్ సర్వీసెస్ కాలేజీ ఏర్పాటు, సముద్ర పరిశోధనలో సహకారం, ఎస్‌బీఎం మారిషస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ, ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య యూఎస్ డాలర్ క్రెడిట్ లైన్ అంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
సుష్మాతోనూ భేటీ
తొలుత మారిషస్ ప్రధాని జగన్నాథ్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు అంశాలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీటర్ ద్వారా తెలిపారు.పర్యటనలో భాగంగా జగన్నాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ ఏడాది మొదట్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జగన్నాథ్ చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే.