న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్–19 కేసులు మొదటి లక్షకు చేరుకునేందుకు 110 రోజులు పట్టగా 9 లక్షల మార్కును 59 రోజుల్లోనే దాటేయడం గమనార్హం. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 34,956 మందికి పాజిటివ్ తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 10,03,832కు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే అత్యధికంగా మరో 687 మంది కోవిడ్ బారిన పడి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,602కు పెరిగిపోయింది.
24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,942 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 6,35,756 మంది రికవరీ కాగా, దేశంలో 3,42,473 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు 63.33 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈనెల 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1,30,72,718 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 658 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇది 4 నుంచి 8 రెట్లు తక్కువ.
క్వారంటైన్‌లో 31.6 లక్షల మంది
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా 31.6 లక్షల మంది బాధితులను క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరిలో యూపీలో అత్యధికంగా 11 లక్షల మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 7.27 లక్షలు, గుజరాత్‌లో 3.25 లక్షలు, ఒడిశాలో 2.4 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్–19 టీకా కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలు రొహ్‌తక్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ ప్రకటించారు.
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్, ఆమె కూతురు ఆరాధ్య శుక్రవారం తీవ్ర జ్వరంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటికే భర్త అభిషేక్, మామ అమితాబ్ బచ్చన్ అదే ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్య కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇన్నాళ్లు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కోవిడ్ పరీక్షల్లో అమెరికా తర్వాత భారత్
ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 4.2 కోట్ల కోవిడ్–19 పరీక్షలు చేపట్టగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ 1.20 కోట్ల మందికి పరీక్షలు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం ప్రెస్ సెక్రటరీ కేలీ మెకెననీ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం అత్యధికంగా 4.2 కోట్ల మందికి పరీక్షలు చేయగా 35 లక్షల మందికి పాజిటివ్‌గా తేలిందని ఆమె తెలిపారు. కోవిడ్ పరీక్షల దృష్ట్యా చూస్తే అమెరికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉందన్నారు. మోడెర్నా సంస్థ రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయనీ, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశ జూలై చివర్లో జరుగుతాయన్నారు.
దేశంలో కరోనా మిలియన్ మార్చ్
Published Sat, Jul 18 2020 4:27 AM | Last Updated on Sat, Jul 18 2020 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment