న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతరూపం దాలుస్తోంది. వరుసగా మూడో రోజు 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 34,884 కేసులు నమోదయ్యాయి. 671 మంది బాధితులు కరోనాపై పోరాడుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 10,38,716కు, మరణాలు 26,273కు చేరుకున్నాయి.
ప్రస్తుతం 3,58,692 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 6,53,750 మంది చికిత్సతో పూర్తిగా కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు. రికవరీ రేటు 62.94 శాతానికి పెరగడం కొంత ఊరట కలిగించే పరిణామం అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా 1,34,33,742 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది.
బాధితులందరికీ వైద్య సహాయం
హోం ఐసోలేషన్‌తోపాటు ఆసుపత్రుల్లో ఉన్న కరోనా బాధితులందరికీ వైద్య సహాయం అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలతో దేశంలో కరోనా రికవరీ రేటు 62.94 శాతానికి పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే రికవరీలు 2.95 లక్షలు అధికంగా ఉన్నాయని తెలియజేసింది. గత 24 గంటల్లో 17,994 మంది బాధితులు కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 9,734 కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపింది.
చికిత్సకు స్పందిస్తున్న బచ్చన్ ఫ్యామిలీ
కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని ముంబైలోని నానావతి ఆసుపత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. అమితాబ్, అభిషేక్ జూలై 11 నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment