జనరేషన్‌ నెక్ట్స్‌ వార్‌కు సై...! | India Equipping weapons For Modern War | Sakshi
Sakshi News home page

జనరేషన్‌ నెక్ట్స్‌ వార్‌కు సై...!

Published Thu, May 24 2018 3:53 AM | Last Updated on Thu, May 24 2018 11:07 AM

India Equipping weapons For Modern War - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అత్యాధునిక యుద్ధతంత్రానికి  భారత్‌ సై అంటోంది. దీనిలో భాగంగా ‘రాబోయే తరం’ యుద్ధరీతులకు త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పుచేర్పులకు అనుగుణంగా సైనికబలగాలు, ఆయుధాలను నవీకరిస్తోంది. సైనికపరంగా పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అంత కంటే సమర్థంగా తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ రెండు దేశాలతో భారత్‌కున్న సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. మానవరహిత మిలటరీ ట్యాంకులు, ఇతర యుద్ధ వాహనాలు, రోబోటిక్‌ ఆయుధాలతో సాయుధబలగాలకు కొత్త శక్తి చేకూరుస్తోంది. దీనితో పాటు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్సులకు ‘నవతరం’ ఆయుధాలు సమకూరుస్తోంది.

సైనిక అవసరాల కోసం కృత్రిమ మేధ వినియోగం ద్వారా నూతన ఆవిష్కరణలకు  చైనా పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా దానికి తీసిపోని విధంగా ‘జనరేషన్‌ నెక్ట్స్‌’ యుద్ధతంత్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. సైనికఅవసరాల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరోపాసంఘం భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అప్థనిస్తాన్, పాకిస్తాన్‌లలోని ఉగ్రవాద శిబిరాలను కృత్రిమమేథ ద్వారా పనిచేసేమానరరహిత డ్రోన్ల ద్వారా అమెరికా సమర్థవంతంగా ధ్వంసం చేస్తోంది. ఐటీ పారిశ్రామిక రంగంలో భారత్‌కు గట్టి పునాదులు ఉండడంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాన్ని  పెంచుకోవడం మరింత సులువు కానుంది. ఈ కీలక ప్రాజెక్టులో డిఫెన్స్‌ రిసెర్చీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ›ప్రధాన భూమిక పోషించనుంది.

భూమి,ఆకాశం, సముద్రంలో....
ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మూడురంగాల్లో ( భూమి, ఆకాశం, సముద్రం) యుద్ధసన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు కృత్రిమ మేథ ప్రాజెక్టులను భారత్‌ ప్రారంభించింది. మానవరహిత ట్యాంకుల వంటి యుద్ధవాహనాలు, ఆకాశం నుంచి, నీటిలోనా ఉపయోగించేలా రోబోటిక్‌ ఆయుధాలు సమకూరుస్తోంది.  మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్‌ యుద్ధాలకు సంసిద్ధమయ్యేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రోడక్షన్‌ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఇందుకోసం సైనిక బలగాలు, ప్రైవేట్‌రంగం మధ్య భాగస్వామ్యనమూనా అమలుచేస్తున్నట్టు చెప్పారు. రాబోయే నవ తరం యుద్ధరీతులను అందిపుచ్చుకోవాల్సి ఉన్నందున, భవిష్యత్‌ నిర్ణేతలో కృత్రిమమేథదే కీలకస్థానమన్నారు.

‘భవిష్యత్‌ అంతా అత్యాధునిక సాంకేతికత నేతృత్వంలోనే సాగాల్సి ఉంది. మరింతగా ఆటోమెటిక్‌ పద్ధతులు, రోబోటిక్‌ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో సైనికశక్తులుగా గుర్తింపు పొందిన దేశాల మాదిరిగానే భారత్‌ కూడా కృత్రిమమేథ ద్వారా సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను మరింత పెంచుకుంటోంది. భవిష్యత్‌ యుద్ధాల్లో  మానవరహిత యుద్ధవిమానాలు, నౌకలు,ట్యాంకులు,రోబోటిక్‌ రైఫిల్స్‌లను ఆయుధ వ్యవస్థలుగా భారత్‌ విస్తృతంగా ఉపయోగించబోతోంది. ప్రపంచ సైనికశక్తులతో పోల్చదగిన విధంగా  దీని కోసం అవసరమైన శక్తియుక్తులు సమకూర్చుకుంటోంది’ అని అజయ్‌కుమార్‌ వెల్లడించారు.–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement