చైనా కీలక భేటీకి భారత్ దూరం?
న్యూఢిల్లీ: ‘ఒకే కారిడార్.. ఒకే రహదారి’ అనే అంశంపై చైనా నిర్వహించనున్న శిఖరాగ్ర సదస్సుకు భారత్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆ విధానం తమకు ఏమాత్రం సమ్మతం కాదనే విషయం చైనాకు తెలియజేయనుంది. సరిహద్దు వెంట రైల్వేలు, విమానాయానం, రోడ్డు మార్గాల ద్వారా ఉమ్మడి కారిడార్‌ను ఏర్పాటు చేసుకునేందుకు పాక్‌తో కలిసి చైనా ముందుకు వెళ్లాలనుకుంటోంది. సీపెక్(ది చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)గా పిలవబడే ఈ ప్రాజెక్టును పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మించనున్నారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ సదస్సుకు చైనా పాకిస్థాన్‌ను, శ్రీలంకను, భారత్‌ను, అమెరికాను, నేపాల్‌ను తదితర దేశాలను ఆహ్వానించింది. అయితే, ఈ సదస్సుకు వెళుతున్నట్లు శ్రీలంక, పాక్ స్పష్టం చేయగా తాను కూడా వెళుతున్నట్లు శుక్రవారం నేపాల్, అమెరికా కూడా ప్రకటించింది. ఆసియా ఖండంలో తనకు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చైనా దీనిని భావిస్తున్నప్పటికీ దానిని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో భారత్ మాత్రం తన ప్రతినిధిని ఈ సదస్సుకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.