
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా (యూటీ)ల్లోని 548 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. చండీగఢ్, ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్. నాగాలాండ్ కూడా ఇందులో ఉన్నాయి. అంతేగాక వాయు, జల, భూ మార్గాల ద్వారా భారత్‌లోకి ప్రవేశించగల 107 ఇమిగ్రేషన్ పోస్టులను మూసేస్తూ రాత్రి నిర్ణయం తీసుకుంది.
దేశీ విమానాలన్నీ రద్దు
రానున్న బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అన్నిరకాల దేశీ విమానయాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానాయాన శాఖ మంత్రి తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్ని ఆపేయడం తెల్సిందే. దేశీ విమానాలపై నిషేధం మార్చి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తుందని విమానయాన శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సరుకుల రవాణా చేసే విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. దేశీ, అంతర్జాతీయ సరుకు రవాణా విమానాల రాకపోకలు ఉంటాయి.
కార్గో విమానాలకు మాత్రమే అనుమతి
శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు సహా అన్ని దేశీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజూ 380కి పైగా దేశీయ సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 8.38 గంటలకు చికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరింది. ఇది మినహా మిగతా అన్నీ ఆదివారం అర్థరాత్రి నుంచి పూర్తిగా టేకాఫ్, ల్యాండింగ్ నిలిపివేశాయి. అంతర్జాతీయంగా మొత్తం 37 ప్రాంతాలకు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment