భారత్, పాక్, బంగ్లా.. మళ్లీ ఒకటవుతాయి!
భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలూ మళ్లీ కలిసి ఒకటైపోతాయని, అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. కేవలం 60 ఏళ్ల క్రితం మాత్రమే చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు తప్పనిసరిగా కలుస్తాయని, అఖండ భారతం ఏర్పడుతుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకు ఆ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళ్తామనో.. లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని, విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇది అవుతుందని అన్నారు. ఇంతకుముందు భారతదేశాన్ని 'హిందూ దేశం'గా అభివర్ణించిన అంశంపై స్పందిస్తూ.. అది ఒక సంస్కృతి మాత్రమేనని, భారతదేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని ఆయన స్పష్టంచేశారు.
అయితే అఖండ భారతావని వ్యాఖ్యలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇదంతా కేవలం ప్రచారమేనని, తమ వైఫల్యాల నుంచి తప్పించుకోడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలా చెబుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ విమర్శించారు. వాళ్లు ఏదో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.