
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే... కక్షపూరిత వాతావరణం నెలకొంది. కూటమిలో ఉంటూనే టీడీపీ...బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రధాని 24 గంటల పాటు నిరంతరం పని చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment