సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ.. చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రాంమాధవ్ విమర్శించారు. కాంగ్రెస్ జేబులో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ లో పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీని కోసం టీడీపీ ఆక్సిజన్ అందిస్తోందని ఎద్దేవా చేశారు.
అవినీతిలో తెలంగాణ రెండో స్థానం
అవినీతి, కుటుంబ పాలనకు ట్రేడ్ మార్క్‌గా అయిన కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే టీఆర్‌ఎస్ సర్కారు తయారైందని రాంమాధవ్ ఆరోపించారు. అవినీతి లో టీఆర్‌ఎస్ సర్కారు రెండో స్థానంలో నిలవగా, ఏపీలో చంద్రబాబు సర్కారు నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. నిరుపేద ప్రజలు, రైతుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అవినీతిపరులు.. కాంట్రాక్టర్ల రాజ్యంగా మారిందని నిప్పులు చెరిగారు. రూ.పది వేల కోట్లతో ఇంటింటికీ తాగు నీరిచ్చేందుకు వీలున్నప్పటికీ.. మిషన్ భగీరథ ద్వారా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండివడ్డారు. ఇంటింటికీ తాగునీరు రాలేదు కానీ, నిధులు మాత్రం ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే.. నాలుగేళ్లలో కేసీఆర్ దోచుకోవాల్సింది అంతా దోచుకుని మళ్లీ అధికారం ఇవ్వాలని ప్రజల వద్దకు వెళ్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జేబులో కూర్చొని రాజకీయాలా?
Published Thu, Nov 1 2018 4:51 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment