కరోనా భయంతో జనం ఇళ్లకే పరిమితం కావడంతో బోసిపోయిన కోల్‌కతా ఫ్లై ఓవర్
కంటికి కనిపించని శత్రువుపై సమర శంఖం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్‌పై సర్కార్ యుద్ధం.. సమూహాల నుంచి సమూహాలకు విస్తరించకుండా క్రిమి సంహారం.. కేంద్రం ఇచ్చిన పిలుపు విందాం. ప్రజల కోసం ప్రజలే నిర్వహించే జనతా కర్ఫ్యూ పాటిద్దాం. కరోనా నుంచి మనల్ని కాపాడుకుందాం. ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ప్యూ కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారికి చికిత్స లేదు. నివారణే మార్గం. ఇందుకు సామాజిక దూరం పాటించడానికి మించిన దారి లేదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యపరంగా అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాలకు రాకుండా సమూహాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పాటించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతీ ఒక్క పౌరుడి మీద ఉంది. ప్రతీ ఒక్కరిలోనూ ప్రభుత్వం ఎందుకింత కఠినమైన ఆంక్షలు విధిస్తోందో అవగాహన రావాలి.
కేవలం ప్రజలే కాదు నాయకులు, సెలబ్రిటీలు కూడా జనతా కర్ఫ్యూ పాటించడానికి సిద్ధమయ్యారు. అత్యవసర సేవలు అందించే వైద్యులు, పోలీసులు, మీడియా ఈ కర్ఫ్యూ పరిధిలోకి రావు. వీరు మినహా యావత్ భారతావని స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతోంది. కరోనా వంటి మహమ్మారి సోకితే సొంత కుటుంబ సభ్యులే దూర దూరంగా ఉండే వేళ ఓర్పుతో, సహనంతో తమ ప్రియమైన వాళ్లని వదిలి వచ్చి మరీ రేయింబవళ్లు సేవలు చేస్తున్న వివిధ వర్గాలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. ప్రధాని పిలుపు మేరకు సరిగ్గా సాయంత్రం అయిదు గంటలకి అందరం వారి వారి ఇంటి బాల్కనీ నుంచి లేదంటే, ఇంటి బయట గుమ్మం దగ్గరకు వచ్చి అయిదు నిమిషాల సేపు గట్టిగా చప్పట్లు కొడదాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారికి ధన్యవాదాలు చెబుదాం.
జనతా కర్ఫ్యూపై దృష్టి పెట్టండి..
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా తమంతట తాముగా జనతా కర్ఫ్యూను పాటించాలని అజయ్ భల్లా శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి గుండె నిబ్బరంతో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, విమానయాన సిబ్బంది, మీడియా ప్రతినిధులు, బస్సు, రైలు, ఆటో డ్రైవర్లు, హోం డెలివరీ బాయ్స్‌కి తమ కృతజ్ఞతలు తెలుపుతూ సాయంత్రం అయిదు గంటలకి ప్రజలందరూ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లో నిల్చొని అయిదు నిమిషాల సేపు చప్పట్లు కొట్టాలని, లేదంటే ఇంట్లో ఉన్న బెల్స్ మోగించాలన్నారు. సమాచారం అందరికీ చేరేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భల్లా రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం అయిదు గంటలకి చప్పట్లు కొట్టాలన్న విషయాన్ని గుర్తు చేయడానికి స్థానిక సంస్థలు, అగ్నిమాపక సర్వీసులు, రక్షణ సిబ్బంది అదే సమయంలో సైరన్ మోగించాలని భల్లా ఆ లేఖలో కోరారు.
ఎక్కడివన్నీ అక్కడే
► మార్చి 21 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్యాసింజర్ సర్వీసుల్ని నిలిపివేసింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా రాత్రి 10 గంటలవరకు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా 3,700 రైళ్లను రద్దు చేశారు.
► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మహా నగరాల్లో అన్ని సబర్బన్ రైలు సర్వీసుల్ని ఆదివారం నిలిపివేశారు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
► గో ఎయిర్ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా ఆదివారం అన్ని విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. భారత్‌లో అత్యధిక విమాన సర్వీసుల్ని నడిపే ఇండిగో 60% వరకు డొమెస్టిక్ సర్వీసుల్ని నడుపుతోంది. ఎయిర్ విస్తా తన సర్వీసుల్ని బాగా కుదించింది.
► ఉబెర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు కూడా ఎమర్జెన్సీ ఉన్నవారికే అందుబాటులో ఉంటాయి
► రాజధాని ఢిల్లీలో 95 వేల ఆటోరిక్షాలు ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించాయి.
► ఢిల్లీలో 15 లక్షల మంది వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. వారిలో కొందరు మార్చి 21 నుంచి 23 వరకు బంద్ పాటిస్తున్నారు.
► గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు మద్దతుగా బస్సు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment