కాల్పులు కొనసాగుతున్నాయి!
సరిహద్దు వెంట మంగళవారం రాత్రంతా పాక్ దాడులు
ఇద్దరు మహిళలు మృతి; 15 మందికి గాయాలు
ఫ్లాగ్ మీటింగ్ ఉండదు: భారత్
న్యూఢిల్లీ/జమ్మూ/కర్నాల్(హర్యానా): హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా భారతీయ నేతలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతూ.. పాక్ దళాలు జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట కాల్పులు, మోర్టా రు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. బుధవారం నాటి తాజా దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా, ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా 15 మంది గాయాల పాలయ్యారు. దీంతో గత వారం రోజుల్లో పాక్ కాల్పుల్లో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. పాక్ దాడులను భారత్ దీటుగా ఎదుర్కొంది. పాక్ క్యాంపులపై ప్రతిదాడులతో బీఎస్‌ఎఫ్ విరుచుకుపడింది. భారతదళాల ప్రతిస్పందనతో ఒక దశలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. భారత్ కాల్పుల్లో గత రెండు రోజుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో 35 మంది చనిపోయారంటూ పాక్ మీడియా వెల్లడించింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ప్రభుత్వ స్పందన సరిగా లేదంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే అన్నీ చక్కబడుతాయంటూ బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు.
192 కిమీల ఐబీ వెంబటి ఉన్న 50 భారత సరిహద్దు కేంద్రాలు, 35 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నిర్విరామంగా కాల్పులు జరిపాయి. జమ్మూలోని కంచక్, పర్గ్వాల్ సబ్ సెక్టార్లలో బుధవారం రాత్రి కూడా మూడు దఫాలుగా పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులు జరిపాయి. ఆర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని దాదాపు 17 వేల మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. చిల్లారి గ్రామంపై జరిపిన దాడుల్లో శకుంతలదేవి, ఆమె కోడలు పోలి దేవి మరణించగా, వారి భర్తలు, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆ గ్రామంలోని వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఫ్లాగ్ మీటింగ్ ఉండదు: కాగా, పాక్ సైన్యాధికారులతో ఎలాంటి ఫ్లాగ్ మీటింగ్ ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయమత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్పారు. పాక్ కాల్పులకు సరైన జవాబిస్తున్న బీఎస్‌ఎఫ్, ఆర్మీలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలను వదిలివెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
పాక్ సైన్యం హస్తం: పాక్ రేంజర్ల కాల్పుల వెనుక పాకిస్థాన్ సైన్యం హస్తం ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఆరోపించారు. పాక్ రేంజర్లు కాల్పులు జరిపిన సరిహద్దు ప్రాంతాల్లో జితేంద్ర సింగ్ బుధవారం పర్యటించారు. సరిహద్దు వెంబటి కాల్పులు తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమని భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ అరూప్ రాహ వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి భారత్ సత్వర పరిష్కారం కోరుతోందన్నారు.
త్వరలోనే అన్నీ చక్కబడతాయి: మోదీ
కాశ్మీర్‌లో పాక్ కాల్పుల ఉల్లంఘనపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ‘‘త్వరలోనే అన్నీ చక్కబడుతాయి’ అని వ్యాఖ్యానించారు. 82వ ‘ఎయిర్‌ఫోర్స్ డే’ సందర్భంగా బుధవారం భారతీయ వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఉరూప్ సాహా ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైమానిక దళ సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పాక్ కవ్వింపు చర్యలకు భారత దళాలు తీవ్రంగా స్పందించాయని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2 రోజుల్లో భారత్ కాల్పుల్లో 35 మంది చనిపోయారన్న పాక్ మీడియావార్తలను రుజువులుగా చూపాయి. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ఐరాసలో ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ అంశంపై వేడి పెంచేందుకే పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నాయి.