పాక్‌కు షాక్: వ్యాపారానికి తాత్కాలిక బ్రేక్
పాకిస్తాన్‌తో క్రాస్ బోర్డర్ ట్రేడ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ భారత ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్: పాకిస్తాన్‌తో క్రాస్ బోర్డర్ ట్రేడ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ భారత ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘించడమే ఇందుకు కారణమని తెలిపింది. మంగళవారం ఫూంచ్ సెక్టార్ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. దీంతో అక్కడ ఉన్న ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్(టీఎఫ్‌సీ) ధ్వంసం అయింది. పాక్ తరచూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సోమవారం ముందు జాగ్రత్త చర్యగా ఫూంచ్ నుంచి పాకిస్తాన్‌కు ఉన్న బస్సు మార్గాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది.
పాకిస్తాన్‌కు పంపాల్సిన సరుకులతో కొన్ని ట్రక్కులు ఎల్‌వోసీ వద్దకు చేరుకోగా.. పాకిస్తాన్ అధికారులు గేట్లు తెరవలేదని టీఎఫ్‌సీ అధికారి తన్వీర్ అహ్మద్ తెలిపారు. దీంతో ట్రక్కలను వెనక్కు తీసుకువచ్చినట్లు చెప్పారు. కాగా, పలు సందర్భాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చే ట్రక్కుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా నిఘాను పెంచారు. 2008లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య వ్యాపారసంబంధాలు ప్రారంభమయ్యాయి. కాగా, గత ఏడాది ఆగష్టులో ఎలాంటి కారణాలు చెప్పకుండా పాకిస్తాన్ భారత్‌తో క్రాస్ బోర్డర్ ట్రేడింగ్‌ను నిలిపివేసింది.