న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10 వేల బలగాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) ఉపసంహరించుకున్నపుడే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని భారత్ స్పష్టం చేసింది. భారత్- చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన తూర్పు లడఖ్‌లోని మూడు ప్రాంతాల(గాల్వన్ లోయ- పెట్రోలింగ్ పాయింట్ 14, పెట్రోలింగ్ పాయింట్ 15, హాట్ స్ప్రింగ్స్- పెట్రోలింగ్ పాయింట్ 17) నుంచి ఇరు వర్గాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించిన విషయం తెలిసిందే. పాంగోంగ్ త్సో ప్రాంతంలోని ఫింగర్స్ రీజియన్, దౌలత్ బేగ్ ఓల్డీ మినహా మిగతా చోట్ల డ్రాగన్ బలగాలు 2 నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చల తర్వాత ఈ మేరకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపాయి.(భారత్- చైనా చర్చలు: బలగాల ఉపసంహరణ!)
ఈ క్రమంలో బుధవారం మరోసారి ఇరు వర్గాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘తూర్పు లడఖ్ సెక్టార్‌లో బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇదంతా బాగానే ఉంది. అయితే ఎల్‌ఏసీ వెంబడి మోహరించిన 10 వేలకు పైగా బలగాలు, ఫిరంగి దళాలను చైనా వెనక్కి పిలిచినప్పుడే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. భారీ ఫిరంగులు, ట్యాంకులు, పదాతి దళం వినియోగించే యుద్ధ వాహనాలను వారు వెనక్కి పంపాలి’’అని ప్రభుత్వ వర్గాలు వార్తా సంస్థ ఏఎన్‌ఐతో పేర్కొన్నాయి. చైనా భారీ మొత్తంలో బలగాలు మోహరించిన నేపథ్యంలో వారికి దీటుగా బదులిచ్చేందుకు వీలుగా భారత్ సైతం 10 వేల బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి. (భారత్‌తో ఏకాభిప్రాయం కుదిరింది: చైనా)
Comments
Please login to add a commentAdd a comment