న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నా, మరోవైపు డ్రాగన్ దేశం మాత్రం ఇండియా సరిహద్దుల్లో నిర్మాణాల పనులు ఆపడం లేదు. డొక్లాంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్ష్‌గాం వ్యాలీలో అన్ని రకాల వాతావరణాల్లో ఉపయోగించగల రోడ్లను చైనా నిర్మిస్తోంది.
భారత్‌కు రక్షణ పరంగా అత్యంత కీలక ప్రాంతం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌కు ఉత్తరాన షాక్ష్‌గాం ఉంది. షాక్ష్‌గాంలో చైనా ఇప్పటికే పది మీటర్లు వెడల్పైన 75 కిలోమీటర్ల రోడ్డు వేసినట్లు తెలిసింది. రోడ్డును మరింతగా విస్తరించేందుకు షాక్ష్‌గాం నదికి తూర్పు తీరం వెంబడి తాత్కలిక షెల్టర్లు, సామగ్రిని చైనా సిద్ధం చేసినట్లు సమాచారం.
డొక్లాం ఉద్రిక్తతల అనంతరం ఈ ప్రాంతంలో చైనా రోడ్డును వేయడం ప్రారంభించినట్లు తెలిసింది. షాక్ష్‌గాం వ్యాలీ సగటున 7 వేల మీటర్ల ఎత్తైన దుర్భేద్యమైన పర్వతాలు, కొండలు, గుట్టల నడుమ ఉంటుంది. చలికాలంలో ఇక్కడి ఉష్ట్రోగ్రతలు ఆర్కిటిక్‌ను తలపిస్తాయి. అయితే, షాక్ష్‌గాం వ్యాలీలో చైనా నిర్మాణాలు జరుపుతోందన్న వార్తలను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు.
సియాచిన్‌కు అతి ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతం ఓ లోయ అని, ఇక్కడ రోడ్లను వేయడం కష్టాసాధ్యమని అన్నారు. షాక్ష్‌గాం వ్యాలీలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని చెప్పారు. 1963లో పాకిస్తాన్, చైనాల మధ్య జరిగిన ఓ ఒప్పందంలో పీవోకేలోని కొంత భూభాగాన్ని పాక్, డ్రాగన్ దేశానికి ఇచ్చింది. అయితే, భారత్ ఈ భూ మార్పిడి ఒప్పందాన్ని గుర్తించలేదు.
Comments
Please login to add a commentAdd a comment