ఆడాళ్లంటే నేతలకు మరీ ఇంత అలుసా! | indian leaders comments over women and rape cases | Sakshi
Sakshi News home page

ఆడాళ్లంటే నేతలకు మరీ ఇంత అలుసా!

Published Sat, Mar 14 2015 4:50 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

ఆడాళ్లంటే నేతలకు మరీ ఇంత అలుసా! - Sakshi

ఆడాళ్లంటే నేతలకు మరీ ఇంత అలుసా!

భారతీయ సమాజంలో ఆడవాళ్లను చులకనగా చూడడం, వారిపై జరుగుతున్న అత్యాచారాలకు వారే బాధ్యులంటూ నిందలు వేయడం, వారి అందచందాల గురించి అసంబద్ధంగా మాట్లాడటం మన ఎంపీలకు, రాజకీయ నేతలకు పరిపాటిగా మారిపోతున్నది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఏ పార్టీవారైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తమ వ్యాఖ్యలపై వివాదం చెలరేగగానే తమ ఉద్దేశం అది కాదంటూ నాలిక్కరుచుకోవడమూ కూడా పరిపాటిగానే మారిపోతున్నది.

దక్షిణాది రాష్ట్రాల అమ్మాయిలు అందంగా ఉంటారని, వారి రంగు, శరీరాలు కూడా అందంగా ఉంటాయని, పైగా వారికి డాన్స్ చేయడం కూడా వచ్చంటూ జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెల్సిందే. బీమా బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ‘ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 29 శాతం నుంచి 49 శాతానికి పెంచడం తెల్లరంగు అమ్మాయి కావాలంటూ ఇచ్చే పెళ్లి ప్రకటనలా ఉంది’ అని అన్నారు. అంతటితో ఆగకుండా ‘దక్షిణాది అమ్మాయిలు  అందంగా ఉంటారు. వారి శరీరాలే కాదు, ఒంటి రంగు కూడా అందంగా ఉంటుంది. అలాంటి అందం ఇక్కడ లేదు’ అని వ్యాఖ్యానించారు. తెల్ల రంగు ఉన్నందుకే వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్‌కు తీహార్ జైల్లో చిత్రీకరణకు అనుమతించారని కూడా ఆరోపించారు. ఆయన మాటల సారాంశం...బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడమంటే నల్లరంగు అమ్మాయిని వదిలేసి తెల్లరంగు అమ్మాయి వెంటబడినట్టనీ...వీటిపై సభ లోపలా బయటా వివాదం రేగడంతో తన ఉద్దేశం నలుపు, తెలుపంటూ ఆడవారి పట్ల వివక్ష చూపడం ఎంత మాత్రం కాదని సమర్థించుకున్నారు. గతంలో నేతలు ఆడవారి గురించి ఇంతకంటే ఘాటైన, వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. వాటిలో మచ్చుకు కొన్ని..
 
ఇంట్లోనే ఉంచితే రేప్‌లు జరగవు: బొత్స సత్యనారాయణ
2012లో ఢిల్లీలో నిర్భయపై గ్యాంగ్ రేప్‌ చేసి చంపేసినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘భారత్‌కు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందంటే రాత్రిపూట స్త్రీలు కూడా తిరగొచ్చని అర్థం చేసుకోరాదు. ఇలాంటి రేపులు జరగకుండా ఉండాలంటే చీకటి పడ్డాక ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాలి’ అన్నారు. నిర్భయ గురించి ప్రస్తావిస్తూ ‘అసలు ఆ సమయంలో ఆమె ఎందుకు ప్రైవేటు బస్సెక్కాలి. అలా ఎక్కకపోతే ఇది జరిగేది కాదు కదా’ అని వ్యాఖ్యానించారు.

అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు: ములాయం
ముంబై శక్తి మిల్స్ ఆవరణలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడాన్ని సమాజ్‌వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఖండిస్తూ, ‘అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు. అంతమాత్రాన ఉరిశిక్ష విధిస్తారా? తాము అధికారంలోకి వస్తే ఇలాంటి చట్టాలను మారుస్తాం’ అని ఆయన గత లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.
 
డిస్కోతెక్‌లో డాన్స్ చేసి వస్తున్నారు: అభిజిత్ ముఖర్జీ
నిర్భయ రేప్‌కు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా కార్యకర్తల గురించి ‘డెస్కోతెక్‌లో డాన్స్‌చేసి ఇక్కడికొచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారు’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు.
 
త్వరగా పెళ్లిళ్లు చేస్తే రేప్‌లు జరగవు: ఓం ప్రకాష్ చౌతాలా
‘అమ్మాయిలకు పిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తే వారిపై రేపులు జరగవు. మొగల్ సామ్రాజ్యంలో రేప్‌ల నుంచి తమ పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు’ అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా వ్యాఖ్యానించారు.
 
పట్టణీకరణ వల్లే రేప్‌లు: మోహన్ భగవత్
సిటీ సంస్కృతి వల్లనే రేప్‌లు జరుగుతున్నాయని, భారత్‌లో రేప్‌లు జరిగేవి కావని, నవీన ఇండియా రేప్‌లు పెరిగాయని 2013లో ఆర్‌ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
 
యాభై కోట్ల గర్ల్ ఫ్రెండ్: నరేంద్ర మోదీ
బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు 2012లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ భార్య సునంద పుష్కర్ గురించి ప్రస్తావిస్తూ ‘వాహ్ క్యా గర్ల్ ఫ్రెండ్ హై. ఆప్నే కబీ దేఖా హై 50 క్రోర్‌ కా గర్ల్ ఫ్రెండ్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement