హ్యాకర్స్ చేతిలో కీలుబొమ్మలు అవుతారా...?
న్యూఢిల్లీ: తమ పిల్లల ఆన్ లైన్ చేష్టలు ఇంటికి చేటు తేస్తాయేమోనని ఇండియన్ పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారట. తమ అమ్మాయ/అబ్బాయి ఎవరైనా సైబర్ నేరాలలో భాగంగా హ్యాకర్స్ చేతికి చిక్కి బాధితులుగా మిగిలిపోతారని టీనేజర్స్ తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లోనే ఈ భయాలు కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నట్లు కొన్ని సర్వేలలో తేలింది. 17 దేశాలలోని 18 అంతకంటే ఎక్కువ వయసున్న 17,125 మంది నెటిజన్లపై నార్టన్ సైబర్ సెక్యూరిటీ గ్రూపు తమ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా భారత్ లో 1000 మంది యూజర్ల తల్లిదండ్రులను ప్రశ్నించి ఈ వివరాలను తెలుసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి 100 మందిలో 92 శాతం పేరేంట్స్ తమ పిల్లల ఆన్ లైన్ యాక్టివిటీస్ గురించి ఏదో ఒక రకంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన 'నార్టన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ సైట్స్ రిపోర్టు' లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాలతో పోల్చితే ఇండియన్ పేరేంట్స్ తమ చిన్నారుల ఆన్ లైన్ యాక్టివిటీస్ 20 శాతం నియంత్రిస్తున్నారని తేలింది. తమ పిల్లులు చేసే పనులతో కుటుంబం మొత్తం దోషులుగా నిలబడాల్సి వస్తుందా.. ఇంటి పరువుకు భంగం వాటిల్లే అవకాశం ఉందని 57 శాతం పేరేంట్స్ భావిస్తున్నారు. హ్యాకర్స్ చేతిలో తమ పిల్లలు కీలు బొమ్మలుగా మారిపోతారని 54 శాతం పేరేంట్స్ టెన్షన్ పడుతున్నారని తాజా సర్వేలో బయటపడింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలపై 55 శాతం మంది తమ పిల్లలపై కొన్ని లిమిట్స్ విధిస్తున్నట్లు తెలిసింది. బయట వాడే కామన్ కంప్యూటర్స్ కంటే కూడా పర్సనల్ సిస్టమ్స్ వాడటం మంచిదని 49శాతం పేరేంట్స్ అనుకుంటున్నారట.