న్యూఢిల్లీ: ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే. ఢిల్లీలో దాడి చేయడానికి వచ్చిన ఐఎస్ ఉగ్రవాదిని నిఘా వర్గాలు ఉచ్చు పన్ని మరీ పట్టుకున్నాయి. సుమారు 18 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ హాలివుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. ఆ ఉగ్రవాదిని నమ్మించడానికి మనోడిని ఉగ్రవాదిగా అతనికి పరిచయం చేయడం దగ్గర నుంచి, పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించిన సమాచారం వరకు ఇదో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గత సెప్టెంబర్‌లోనే ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా, అధికారులు ఆ వివరాలను తాజాగా వెల్లడించారు.
పాకిస్తాన్‌లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ ఉగ్రవాదుల బృందం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. ఐఎస్ కార్యకలాపాల నిమిత్తం దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.34 లక్షలు పంపినట్లు అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసిన తరువాత అఫ్గానిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడేందుకు వస్తున్నట్టు తెలిసింది.
కీలక సమాచారం లభ్యం..
ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన ఉగ్రవాదితో స్నేహం పెంచుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ ఏజెంట్ అవతారంలో ఓ వ్యక్తిని పంపింది. అతని ద్వారానే ఉగ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో వసతితో పాటు, పేలుడుపదార్థాలు సమకూర్చారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది కదలికలపై నిఘా పెట్టేందుకు నెలరోజుల నిరంతరం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్‌టెన్షన్ మార్కెట్‌లలో ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడు.
వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు సమయం చూసుకుని అతన్ని అరెస్ట్ చేసి అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అతడి వద్దే సేకరించారు. 2017 మే 22న బ్రిటన్‌లో 23 మందిని బలిగొన్న మాంచెస్టర్ దాడి అతడి సహచరుల్లోని ఒకరి పనేనని తేలింది. ఆ దాడిలో ఏయే పేలుడు పదార్థాలు వాడారో, అలాంటి వాటినే ఢిల్లీ పేలుళ్లలో వాడాలని అతడు కోరుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment