
మసూద్‌పై చైనా తీరుకు భారత్ ప్రతీకారం
ఉయిఘూర్ ఉగ్రవాదికి వీసా
న్యూఢిల్లీ: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో అడ్డుపడ్డ చైనాకు భారత్ అదే స్థాయిలో సమాధానమిచ్చింది. చైనా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించిన ‘ఉయిఘూర్ కాంగ్రెస్’ గ్రూపునకు చెందిన డోల్కున్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘సిటిజన్ పవర్ ఫర్ చైనా’ ధర్మశాలలో (హిమాచల్‌ప్రదేశ్) నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఉయిఘూర్ కాంగ్రెస్ సభ్యుడు (జర్మనీలో తలదాచుకుంటున్నాడు) హాజరుకావాల్సిఉంది. చైనాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటంపై భేటీలో చర్చించనున్నారు. 2009లోనే ఉయిఘూర్ సభ్యులకు భారత్ వీసా నిరాకరించింది.
కానీ, మసూద్ విషయంలో చైనా తీరుకు నిరసనగా ఇసాతోపాటు పలువురు ఈ సంస్థ సభ్యులకు వీసాలివ్వటంతో చైనాకు బలమైన సంకేతాలు పంపింది. దీనిపై చైనా మండిపడింది. ‘మేం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిన వ్యక్తిని చైనాకు అప్పగించాల్సింది ఆయా దేశాల బాధ్యత’ అని విమర్శించింది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం దమనకాండకు బాధితులే ప్రస్తుత ఉయిఘూర్ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించటంతో చైనా వీరిపై ఉగ్రవాద ముద్ర వేసింది. కొంతకాలంగా తమ సంస్కృతిని కాపాడుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.