మళ్లీ చైనా మోకాలడ్డింది!
జేషే మహమ్మద్ చీఫ్, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మరోసారి మోకాలడ్డింది. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ ప్రతిపాదించగా.. ఇందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు తెలిపాయి.
చైనా మాత్రం మొండిగా ఈ ప్రతిపాదనను అడ్డుకుంటూ వస్తున్నది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రతిపాదన ఆమోదం పొందకుండా అడ్డుకున్న చైనా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిని నిలిపివుంచుతూ టెక్నీకల్ హోల్డ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. దీని గడువు ఈ నెల 2తో ముగిసింది. దీంతో ఈ ప్రతిపాదనపై టెక్నీకల్ హోల్డ్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్‌కు కొమ్ముకాసేవిధంగా చైనా ఈవిధంగా వ్యవహరిస్తుండటంతో ఉగ్రవాదం విషయంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని భారత్ గతంలోనే నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.