తిరువనంతపురం: కేరళకు చెందిన వైద్య విద్యార్థిని భారత్‌లో కోవిడ్ సోకిన తొలివ్యక్తి. 39 రోజుల పాటు ఆమెను విడిగా నిర్బంధంలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బట్టబయలైన చైనాలోని వూహాన్ యూనివర్సిటీ వైద్య విద్యార్థిని, 20 ఏళ్ల వయసున్న ఆమె ఎన్డీటీవీతో పంచుకున్న మనోగతం ఆమె మాటల్లోనే.
‘నాకు కోవిడ్ సోకిందని జనవరి 30న వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెంటనే నాతో పాటు ప్రయాణించిన నా స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఆరోగ్య శాఖ అధికారుల్ని సంప్రదించాలని చెప్పాను. ఆ తర్వాత వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నా. నేను చైనాలో ఉన్నప్పుడు చూశాను. ఈ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టం కాదు. అందులోనూ నేను శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాను. కానీ అందరికీ దూరంగా, ఎవరితోనూ సంబంధాలు లేకుండా అన్ని రోజులు ఏకాంతంగా ఉండడం అంత సులభం కాదు. అయితే ఈ అంశంలో నాకు వైద్యులు బాగా సహకరించారు. అత్యుత్తమమైన చికిత్స ఇచ్చారు. ఇంటికి వచ్చాక నేను మానసికంగా దెబ్బ తినకుండా కౌన్సెలర్లు తరచూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఎప్పటికప్పుడు నాలో ధైర్యాన్ని నింపారు. ఆమె మా అమ్మతో స్వయంగా మాట్లాడి భరోసా నింపారు. చైనాలో జనవరి 13 నుంచి మా విశ్వవిద్యాలయంకు దాదాపు నాలుగు వారాల పాటు సెలవులు ఇచ్చారు. అప్పుడంతా బాగానే ఉంది. కానీ మూడు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. వీధుల్లో స్థానికులు అందరూ మాస్క్‌లు ధరించి కనిపించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది. భారత రాయబార కార్యాలయం మా అందరినీ వెనక్కి తీసుకువచ్చింది. మా క్లాస్‌లో 65 మంది విద్యార్థులు ఉంటే అందులో 45 మంది భారతీయులమే. ప్రస్తుతం మేమంతా ఆన్‌లైన్‌లో క్లాస్‌లకు అటెండ్ అవుతున్నాం’ అని ఆ విద్యార్థిని తన అనుభవాలను వివరించారు.
కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని
Published Thu, Mar 5 2020 3:53 AM | Last Updated on Thu, Mar 5 2020 4:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment